మంచిర్యాల జిల్లా,
జన్నారం,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
జన్నారం: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల, కవ్వాల్ లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను మండల తహసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి తో కలిసి సందర్శించి తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, హాజరు పట్టికలు, మూత్రశాలలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
మెనూ చార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందని, ఈ క్రమంలో విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం తయారు చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, వంట చేసేవారు శుభ్రత పాటించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటించాలని, బడి వయసు గల పిల్లలు, మధ్యలో బడి మానివేసిన పిల్లలు తిరిగి పాఠశాలకు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






