కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు ఫల వృక్షాల మధ్య కొల్లూరు లో మూకాంబికా క్షేత్రం ఉంది.

కామాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు. కామాసురుడు ఒక మహిళ చేతులలోనే చస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలీలగా సంహరించింది.

ఆమె ధైర్యానికి మెచ్చి శివుడు ఇక్కడ తన కాలి మడమతో శ్రీ చక్రాన్ని సృష్టించి ప్రతిష్టించాడని ప్రతీతి. ఆలయానికి కనీసం 1200 ఏళ్ళ చరిత్ర ఉంది. హలుగల్లు వీర సంగయ్య అనే రాజు అమ్మ వారి విగ్రహం చెక్కించాడని చెప్పుకొంటారు.

మంగుళూరు నుండి నూట ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉడిపి క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కుడజాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తుంది. తమిళనాడుకు అతి సమీపంలో ఉంటుంది.

బంగారు శిఖరంతో భక్త జనాల దృష్టిని ఆకర్షిస్తుంది.ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మ వారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం. ఆదిశంకరాచార్యుల వారు ఆలయంలో శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించటంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది.

పంచముఖ గణేశ ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాజిల్లుతుంది. కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాలలో కొల్లూరు ఒకటి. మిగిలినవి ఉడిపి, సుబ్రహ్మణ్య, కోడేశ్వర, శంకర నారాయణ, గొకర్ణ క్షేత్రాలు.

కుడజాద్రి పర్వతంపై ఆదిశంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మావారు ప్రత్యక్షం అయ్యారట. ఆదిశంకర్యాచార్యులు అమ్మ వారిని తన జన్మస్థలమైన కేరళకు రమ్మని అడిగారట.

దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆదిశంకరాచాయుల వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని, అలా వెనక్కి తిరిగి చూస్తె చూసిన స్థలంలోనే స్థిరంగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట.

ఆ షరతుకు అంగీకరించిన ఆదిశంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన్ని అనుసరించారట. అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందెల శబ్దం వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు వెనక్కు తిరిగి చూశారట.

అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్టించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారని ప్రతీతి. గర్భాలయం లో ”శంకర సింహాసనం ఉంది.

మూకాంబిక సరస్వతి మహాకాళి, శక్తిలా సంయుక్త స్వరూపంగా భావిస్తారు. అమ్మవారు కొలువైన కుడజాద్రి పర్వతం మీదనే ఆదిశంకరులు తపస్సు చేసిన అంబవనం, చిత్రమూలం ప్రదేశాలున్నాయి.

భక్తులు వీటిని దర్శించి దివ్యానుభూతికి లోనవుతారు. కర్ణాటకను పాలించిన రాజులందరూ అమ్మవారికి విశేష మైన కానుకలు సమర్పించి భక్తిశ్రద్ధలతో అర్చించారు. నగర, బెద్నూర్ రాజులకు ఈ దేవాలయమే ”రాజ దేవాలయం” వారి యిలవేల్పు మూకాంబికయే.

మహారాష్ట్ర విజయనగర ప్రభువుల పాలనలో కూడా వైభవం పొందింది. ఆ తర్వాతా ముష్కర తురుష్క పాలనలో దోపిడీకి గురైంది. ఇక్కడి కోట్లాది రూపాయలు విలువచేసే అమూల్య సంపద అంతా దోచుకోబడింది.


పురాణ కధనం

శివుని వరం పొందిన కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి, దేవతలను మునులను హింసించే వాడు. సప్తర్షులు వీడి పీడ ఎలా విరగడ అవుతుందా అని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ విషయాన్ని శుక్రాచార్యుడు వాడి చెవిన వేసి, వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుంది అని చెప్పాడు. వెంటనే వాడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.

కామాసురుడికి శివుడు వరం ఇస్తే లోకకంటకుడు అవుతాడని భావించి వాగ్దేవి సరస్వతీ దేవి వాడి నాలుక పై చేరి మాట రాకుండా మూగ వాడిని చేసిందింది.

మూగవాడై పోయినందువల్ల ఆ కామాసురుడు శివుడిని నోటిమాటతో ఏ వరమూ కోరకోలేక పోయాడు అప్పటి నుంచి వాడిని మూకాసురుడు అన్నారు. అప్పుడు కోల రుషి ఉపాయం మేరకు పార్వతీ దేవి సకలదేవతల శక్తులన్నిటిని కలిపి ఒక తీవ్రశక్తిగా సృష్టించింది.

ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది. వాడి ప్రార్ధన మన్నించి వాడికి కైవల్యం ప్రసాదించింది. మూకాసురుడిని దేవి సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టే అంటారు(మరణగద్దె). మూకాసురుడు అమ్మవారిని మూకాంబికగా తనపేర వెలసిల్లమని కోరుకొన్నాడు.

వాడి కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగుబంగారంగా ఉంది.
ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శన మిస్తుంది. శంఖం, చక్రం, గద ఆయుధాలను ధరించి ఉంటుంది.


ఆలయ వైశిష్ట్యం

మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని, తెలివిగల వారై సంపన్నులు అవుతారని ప్రతీతి. అమ్మవారి సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది. సింహద్వారం గుండామూకాంబిక ఆలయంలో తేనె, మొదలైన పదార్థాలతో తయారు చేసే “పంచకడ్జాయం’ అనే ప్రసాదం పెడతారు.