పాల్వంచ, ఫిబ్రవరి 8,2024

అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన షేక్ రిజ్వాన్ అహ్మద్ సీలేరు నుండి గంజాయిని తరలించడానికి నిర్ణయించుకుని తన వద్ద ఉన్న బ్యాగులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లను నింపుకుని హైదరాబాద్ వెళ్లే బస్సుl ఎక్కాడు.

బస్సు పాల్వంచ చేరుకునే క్రమంలో జిసిసి గోడౌన్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బస్సులో నుండి ఇదంతా గమనిస్తున్న అహ్మద్ బస్సును కూడా తనిఖీ చేస్తారని, తాను పట్టు పడడం తప్పదని గ్రహించాడు. బ్యాగుతో సహా బస్సులో నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతనిని వెంబడించి పట్టుకున్నారు.

అతని వద్ద నుండి బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో 10 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రెండు లక్షల అరవై వేలు ఉంటుందని అంచనా.

ఈ దాడుల్లో పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము, అడిషనల్ ఎస్సై రాఘవయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.