💠 దేవాలయాలలో ఏదైనా ఇతర దేవతలను సందర్శించే ముందు, గణేష్, విఘ్నేశ్వరుడు లేదా గణపతి అని కూడా పిలువబడే వినాయకుని దర్శనం కలిగి ఉండటం చాలా అవసరం. ఇంట్లో ప్రతి పూజ, వ్రతం లేదా వేడుకల సమయంలో విఘ్నేశ్వరుని విగ్రహాన్ని పవిత్రమైన పసుపుతో పూజించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోయి, ఆచారాలు విజయవంతంగా మరియు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయని వివిధ ఇతిహాసాలు మరియు పురాణాలలో పేర్కొనబడింది. తొలి పూజలందుకునే గణపతిని హిందువులే కాదు.. అనేక దేశాల ప్రజలు పూజిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు.. హిందువుల ఇంట్లో సందడి మొదలవుతుంది.  గణపతి దేవాలయాలతో పాటు.. దేశ వ్యాప్తంగా మండపాలలో చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

💠 మన దేశంలో వినాయకునికి వివిధ పేర్లతో అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రముఖ క్షేత్రాల్లో కొలువైయున్న ఒకొక్క గణపతి ఒకొక్క విశిష్టతను సొంతం చేసుకున్నాడు. 

💠 రోజు రోజుకీ పెరుగుతున్న వినాయకుడు అంటే సర్వసాధారణంగా తెలుగువారికి కాణిపాకం వినాయకుడు గుర్తుకు వస్తాడు..అలాగే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు, చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ వినాయకుల మాదిరిగానే బెంగళూరులోని దొడ్డ గణపతి పరిమాణం ఏటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కుడివైపుకు పెరుగుతూ, దొడ్డ గణపతి ఏకశిలా గణేశుడుగా మారాడు. 

💠 ఈ ఆలయంలోని దేవతను శక్తి గణపతి లేదా సత్య గణపతి అని కూడా అంటారు. అక్కడ చవితి వేడుకలకు ప్రసిద్ధి..  ఇక వెన్నతో చేసే అలంకరణ చూడడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవంటారు.

దొడ్డ గణపతి విశిష్టత… – స్థల పురాణం…

💠 దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు ఉంది.
కన్నడంలో దొడ్డ అంటే ‘పెద్ద’ అని అర్థం. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంది. ఇది ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడికి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది. ఈ దొడ్డగణపతి ఆలయాన్ని బెంగళూరును తీర్చిదిద్దిన కెంపెగౌడ నిర్మించారు.

ఆలయ చరిత్ర

💠 ఒకసారి కెంపెగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు కనిపించాయట. అందులో ఒక్కదాని మీద వినాయక ప్రతిమను చూసి, వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని మలచమని ఆఙ్ఞాపించారట.  అప్పుడు మలచిన గణపతినే ఈరోజు మనం చూస్తున్న దొడ్డ గణపతి. ఇక్కడ ఆలయం గోపురం, దేవాలయం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకుడు  దొడ్డ గణపతి ఆలయం, బసవన్న గుడిని దర్శించకుండా వెళ్ళరు.

💠 దేవాలయంలోని దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం..  18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు.

బెంగళూరు ‘కరగ’ ఉత్సవ సంబరాలు

💠 ఈ ఆలయంలో విశేషం ఏమిటంటే … ఇక్కడి విగ్రహం ఆలయం కుడివైపుకి క్రమంగా పెరగటం భక్తులు ఇది దేవుని మహిమగా చెబుతారు.
బెంగళూరు నుంచే కాదు కర్ణాటక రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించి, తమ కోరికలు తీర్చమని కోరుకుంటారు.

స్వామి వారి వెన్న అలంకరణ

💠 వారంలో అన్ని రోజులలో స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు.  రకరకాల అలంకరణ చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈ అలంకరణలో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించటం. దీన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని భక్తులు చెప్పుకొంటారు. వెన్న అలంకరణలో ఉన్న గణపతిని చూస్తే జన్మ ధన్యం అయినట్లు భావిస్తారు. ఈ భారీ గణేషుని శరీరానికి వెన్న పట్టించటానికి 100 కేజీలకు పైగా వెన్న అవసరం అవుతుంది. కొన్నిసార్లు, పొడి ద్రాక్ష మరియు బాదం కూడా వెన్న పొరపై స్థిరంగా ఉంటాయి. ఈ అలంకరణ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే గర్భగృహం లోపల వెచ్చదనం ఉన్నప్పటికీ, వెన్న కరగదు. మార్కెట్‌లో లభించే దాదాపు అన్ని కూరగాయలను ఉపయోగించి కూరగాయల అలంకరణలు కూడా చేస్తారు.

💠 దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం 7 గంటల నుంచి 12. 30 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 5. 30 గంట నుండి రాత్రి 8.30 గం. వరకూ ఉంటుంది. వినాయక చవితి నుంచి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. ఇక ఈ ఆలయ వెనక శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు ఉన్నాయి.

💠 బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, బసవనగుడిలోని బుల్ టెంపుల్ రోడ్‌లో దొడ్డ గణపతి ఆలయం లేదా బసవనగుడి గణేష్ ఆలయం ఉంది.