హిందూ పంచాంగ ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి.

ఉగాదికి ముందు ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశినే పాపవిమోచని ఏకాదశి అంటారు. దీనినే పాప నాశని ఏకాదశి అని కూడా అంటారు. అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం. దీని వెనక ఒక కథ ఉంది.

పూర్వం మేధావి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడి ఆదేశానుసారం మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఆయనకు విఘ్నం కలిగించిందంట. ఆమె నాట్యానికి చలింలిచిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగాలని శపించారట. ఆమె రాక్షసి అయిపోయింది. తిరిగి ఆయన తపస్సులో లీనమయ్యాడు. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షస రూపం పోయి, తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాప విమోచన మార్గాన్ని చెప్పారు.

ఆయన సూచన మేరకు మంజుఘోష ఏకాదశి వ్రతం ఆచరించి తన పూర్వ స్వరూపాన్ని పొందింది. చేసిన పాపాలను తొలగించినందున ఈ ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక ఈ ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు.

ఈ రోజున ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుందని పురాణాలు సైతం చెబుతున్నాయి.

పాప మోచని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున శ్రీమహా విష్ణువు ఆలయానికి వెళ్లి ఆరాధించాలి. స్వామి వారికి ఈరోజు పసుపు రంగు దుస్తులను అర్పించాలి. దీని తర్వాత 11 పసుపు పువ్వులు, 11 రకాల తీపి పదార్థాలను స్వామికి అర్పించాలి. అనంతరం విష్ణువు నామాలను, మంత్రాలను జపించాలి. అదే విధంగా ఈ రోజంతా ఉపవాసం ఉండాలి.

ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పినట్టు పురాణ వచనం. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించిన వారికి మోక్షం కూడా లభిస్తుందట.