localnewsvibe

వేమన పద్యం :

ఏరూప మెచట జూచిన
నీరూపమె కానుపించు నిలిపి తెలవయా
నీరూపమె తా నెరిగిన
ధారుణిలో  నీశ్వరుండు తానే వేమా !

తాత్పర్యము :

ఏ రూపము చూచినను ఓ స్వామీ !
నీ రూపమే నాకు కనబడుచున్నది అని అనుకోవలెను.
దైవ స్వరూపమును ఎరిగినవాడే ధన్యాత్ముడు.


వేమన పద్యం :

ఏరూపు మదిని గోరిన
నారూపే తోచు భ్రమల నౌగాదనమిమ్
ధారాళము గనుబ్రహ్మము
కోరికలను మించిచూడ గుదురును వేమా !

తాత్పర్యము :

కోరికలను అణగద్రొక్కుకొని , పరబ్రహ్మ స్వరూపమును కాంచుటకు ప్రయత్నించు.
అవునంటూ , కాదంటూ కాలక్షేపము చేయకుము.
జాగ్రత్తగ కనుగొనిన బ్రహ్మతత్త్వము సులభముగ అవగతమగును.


వేమన పద్యం :

ఏరూపున నారూపము
లోరూపున జూచుచుండు లోకారాధ్యుం
డేరూపు జూచు వారికి
నారూపై కానుపించు నభవుడు వేమా !

తాత్పర్యము :

దైవమును ఏ దృష్టితో చూచిన , అట్లే మనకు కనపడును.
చూచే చూపులోనే అంతా నిండియుండును.