భారత్, యూఎస్ పోల్స్‌లో పోలికలు
Caption of Image.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య పోటీ రోజురోజుకూ ముదురుతోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నెలరోజులపాటు గడిపిన క్రమంలో నేను భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌లోని స్టార్ క్యాంపెయినర్ల ప్రచార శైలిలో అనేక సారూప్యతలను గమనించాను. ఆరోపణలు, ప్రతిఆరోపణలు, పరస్పర దూషణల భాషను ఉపయోగించడం, బహిరంగంగా అక్కసు వెళ్లగక్కడం సర్వసాధారణం. అయినప్పటికీ వారు భారతదేశపు నాయకులతో పోలిస్తే , ప్రత్యర్థులను కించపరచడానికి అన్ని పరిమితులను దాటినప్పటికీ కొంత మర్యాదను పాటిస్తున్నారు.
అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను మన ప్రధాని నరేంద్ర మోదీతో పోల్చడం తేలిక. ఇద్దరూ డెబ్బైల వయసులో ఉన్నారు. అయితే, ట్రంప్ మోదీ కంటే నాలుగేండ్లు పెద్ద. అతడి వయసు 78ఏండ్లకు చేరుతోంది. మోదీ ప్రతి రోజూ యోగా సాధన చేయడం వల్ల దృఢంగా, శక్తిమంతంగా కనిపిస్తారు. ఇద్దరూ రాజకీయపరంగా అపర చాణక్యులే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్నికల సమయంలో ట్రంప్, మోదీ ఇద్దరూ దేవుళ్లను ప్రార్థించారు. మోదీ తనకు దేవుడి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటే, షూటౌట్ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ తనను దేవుడే రక్షించాడని భావిస్తున్నట్లు తెలిపారు.
భారత ప్రధాని అభ్యర్థుల మధ్య డిబేట్ ఉంటే..
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య డిబేట్ జరిగినట్లే భారతదేశంలో ప్రధానమంత్రి అభ్యర్థులు మధ్య జరిగేతే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఎప్పుడూ ముఖాముఖిగా డిబేట్‌లో పాల్గొనలేదు. ఒకే సమయంలో ఒకరినొకరు విమర్శిస్తున్నప్పటికీ, వీరిని ముఖాముఖిగా డిబేట్‌లో పాల్గొనమని కోరితే వారిద్దరూ సమానంగా ప్రశాంతంగా ఉండగలుగుతారా? జాతీయ ప్రాధాన్యత, భద్రత, ప్రజా ప్రాముఖ్యత వంటి విషయాలపై వారు చర్చించేందుకు నిజంగా ఇష్టపడతారా అనేది మన ముందున్న ప్రశ్న.
డిబేట్‌లో విస్తృత అంశాలు
యూఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్ విషయానికి వస్తే, ఈ డిబేట్‌లో మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోవడం లేక ఎంచుకోకపోవడం అనేది ఉండదు. కానీ, దేశంతోపాటు దేశప్రజలకు సంబంధించిన సమస్యలలోని ప్రతి అంశాన్ని డిబేట్ ప్రతిబింబిస్తుంది. ట్రంప్,కమలాహారిస్ మొదటి, చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో టీవీ యాంకర్లు అన్ని తీవ్రమైన సమస్య లను స్పృశించారు.
రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతలు, యువత, మహిళలు, ఉపాధి, జాతి, యుద్ధం. చొరబాట్లకు సంబంధించి యూఎస్ అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరూ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. ఇక వారిలో ఎవరిని తమ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటే మంచిదో అమెరికా ప్రజలే నిర్ణయించుకోవాలి. కాగా, ఇదే పద్ధతిని మన ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా అనుకరిస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. భవిష్యత్తులో ఇది జరగాలంటే, ఒకరి పట్ల ఒకరు సహనంతో వ్యవహరించడం నేర్చుకోవాలి.
భారత్‌లో క్యాంపెయిన్ సులభం
భారతదేశంలో ఒక నాయకుడు తను ఎంచుకున్న నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతం ప్రకారం సమస్యలు ఎంపిక చేసుకుని, తగినవిధంగా స్పీచ్‌ను సిద్ధం చేసుకుని క్యాంపెయిన్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రత్యర్థిని విమర్శించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రసంగాల వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని పాయింట్లు మరచిపోయినా చింతించాల్సిన అవసరం ఉండదు. నాయకుల క్యాంపెయిన్‌లో ప్రజానికానికి సంబంధించిన ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం కంటే ప్రత్యర్థులను పేరుపేరునా ప్రస్తావించి కించపరచడమే ఎక్కువగా ఉంటుంది.
మీడియా ప్రభావంయూఎస్‌లోని మీడియా సంస్థలు, చానెల్స్ భారతదేశంలో వలె సమానంగా పక్షపాతంతో ఉన్నాయి. ఈక్రమంలో సీబీఎస్ న్యూస్‌కి చెందిన కమలా హారిస్ 60 నిమిషాల ఇంటర్వ్యూ రికార్డులపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముందుగా ఎడిట్ అయిందని ఆరోపించారు. భారతదేశంలో కూడా టీవీ చానెల్స్ తరచుగా ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ వైపు, ఎక్కువగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్, భారతదేశం ఎన్నికలలో ఒకేలా ఉండే అనేక సమస్యలు ఉన్నాయి. బీజేపీ ఎన్నికలను రిగ్గింగ్ చేసిందని, రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఎన్నికల్లో ప్రజాతీర్పును, తన ఓటమిని అంగీకరించలేదు.
బీజేపీని అడ్డుకున్న కాంగ్రెస్
భారతదేశంలో రాజ్యాంగాన్ని రీప్లేస్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ రూపొందించిన కథనం కారణంగా కమలం పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ కంటే తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్‌లో కూడా ట్రంప్ తనపై దాఖలైన కేసులకు డెమోక్రాట్‌లే కారణమని నిందిస్తున్నారు. కమలా హారిస్ ఎన్నికల్లో గెలిస్తే డెమోక్రాట్లు తిరిగి మన దేశాన్ని నాశనం చేస్తారని ఆయన ప్రచారం చేస్తున్నారు.
సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీలతో పాటు దేశంలోని రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్ మొదలైన సంస్థలను కించపరిచే విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య జరిగిన వాగ్వాదాన్ని ఈ బ్లేమ్ గేమ్ నాకు గుర్తు చేసింది. తన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్ వాదిస్తూ.. తను ఇంతకు ముందెన్నడూ ఇంత చెత్త కాలాన్ని చూడలేదని, ప్రజలు బయటకు వెళ్లి తమకు అవసరమైన ఆహారం, బేకన్ లేదా గుడ్లు, మరేదైనా కొనుగోలు చేయలేకపోతున్నారని అన్నారు. అమెరికా ఇంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే, భారత్‌లో ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనుకుంటున్నట్లు మోదీ చెప్పారు.
పరిస్థితి ఉంటుందా? చొరబాట్ల సమస్యలో సారూప్యత
భారతదేశంలో ఎక్కువ ఓట్లు పొందేందుకు, సరిహద్దు చొరబాట్లపై పార్టీ నాయకులు తరచుగా పరస్పరం నిందించుకుంటారు. బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయి. రోహింగ్యాలను దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నారు. ట్రంప్ ఆరోపణల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించడం రికార్డు స్థాయికి చేరుకుంది. 11 మిలియన్ల మంది అనుమతి పత్రాలు లేని వలసదారుల సమస్య అమెరికా రాజకీయాల్లో ఒక అస్త్రమైంది. అమెరికాలోకి నేరగాళ్లు చొరబడటంతో వెనిజులా తదితర దేశాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని ట్రంప్ ఆరోపించారు.
రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణాస్త్రాలు
భారతదేశంలో వివక్ష కుల వ్యవస్థ రూపంలో ఉంటే, యూఎస్‌లో ఇది జాతి వివక్ష రూపును సంతరించుకుంది. ట్రంప్ పక్షపాతంతో వ్యవహరిస్తారని, నల్లజాతీయులకు వ్యతిరేకంగా ఉన్నారని హారిస్ ఆరోపించింది. భారతదేశంలో చాయ్‌వాలా ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మనం మర్చిపోకూడదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్ – ఇతర దేశాల యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడం గురించి, సూపర్-పవర్‌గా ఉండటం గురించి వారు మాట్లాడుతున్నప్పుడు అభిప్రాయాల్లో తేడాలు కనిపించవు. కానీ, భారతదేశంలో చర్చ పాకిస్తాన్, చైనాల ముప్పు నుంచి మన దేశాన్ని రక్షించడంపై ఎక్కువగా పరిమితం అవుతోంది. అయితే ప్రజాస్వామ్యపరంగా ఒక అంశంలో యూఎస్ కంటే భారత్ మెరుగ్గా ఉంది. మన ఎన్నికల ఫలితాలు వెలువడగానే అధికార మార్పిడి సాఫీగా, శాంతి యుతంగా జరిగిపోతుంది.
అమెరికాలోనూ ఉచితాలు
భారతదేశంలో మాదిరిగానే, యూఎస్ అభ్యర్థులు కూడా సమాజంలోని అన్ని వర్గాలవారికి, యువత, మహిళలు, నిరాశ్రయులకు ఉచితాలు ఇవ్వడంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ $ 50,000 పన్ను మినహాయింపు ఇస్తానని చిన్నపాటి వ్యాపారులకు హామీ ఇచ్చారు.- వారిని అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పేర్కొంటూ చిన్న వ్యాపారాలను పెంచాల్సిందిగా సూచించారు. మొదటిసారిగా ఇల్లు కొనుగోలు చేసేవారికి $25,000 డౌన్ పేమెంట్ సహాయాన్ని కూడా కమలా హారిస్ ప్రకటించింది.
– అనితా సలూజా, సీనియర్ జర్నలిస్ట్ (ఢిల్లీ)-
©️ VIL Media Pvt Ltd.