మంచిర్యాల జిల్లా,
తాండూరు,
తేదీ:13 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
తాండూరు: తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సాపూర్ గ్రామంలో వాగు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ క్రమంలో ఓ గర్భిణికి అత్యవసర వైద్య చికిత్స కోసం గ్రామం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
అయితే వాగు ఉధృతి కారణంగా కుటుంబ సభ్యులు స్వయంగా ఆమెను దాటించే ప్రయత్నము చేసి విఫలమయ్యారు. విషయం తెలిసిన వెంటనే తాండూర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, వరద ఉధృతిని లెక్క చేయకుండా తాడు సాయంతో బాధితులను వాగు దాటించి అవతలి వైపుకు చేర్చారు.. గర్భిణిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా వాగు దాటించారు.
అనంతరం ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. తమ ప్రాణాలకు తెగించి అత్యవసర సమయంలో సహాయం చేసిన పోలీసులకు గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు చేసిన ఈ రక్షణ చర్యను శబాష్ పోలీస్ అని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
