భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం ఆగస్టు 26,2025
✍️దుర్గా ప్రసాద్

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దాం… – జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా ముందుగా రోడ్డు భద్రతకు సంబంధించి, తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత శాఖ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో మోటారు వాహనాలు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయన్నారు. వాహనాలు కండిషన్ గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

ప్రమాదాల భారిన పడిన వారి కుటుంబ సభ్యులు అనాధలవుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించడానికి పోలీసులు, ఆర్‌అండ్‌బీ, వైద్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు.

తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్‌ ధరించేలా చూడాలన్నారు. వీటిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని పోలీసు శాఖను ఆదేశించారు.

జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు రబ్బరు వేగ నియంత్రికలు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రవాణాశాఖను ఆదేశించారు. రహదారుల కూడళ్లు, ధాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖలు కలిసి సమన్వయంతో శ్రమిద్దామని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ భద్రాచలం చంద్రశేఖర్, ఆర్ అండ్ బి ఈ ఈ కొత్తగూడెం వెంకటేశ్వర్లు, డిఈ నాగేశ్వరావు, ఎన్ పి డిసి ఎల్ ఎస్. ఇ, మహేందర్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఇల్లందు శ్రీకాంత్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఆర్టీవో వెంకటరమణ, కొత్తగూడెం నేషనల్ హైవే డి ఈ శైలజ, మెడికల్ డిపార్ట్మెంట్ వీరబాబు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

error: -