🍁భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. వాటిలో విశిష్టమైనవి. అందరూ భక్తితో ఆరాధించే దేవీ నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు ఆసేతుహిమాచలం అమ్మవారి ఆరాధనలో పూనీతమవుతుంది. శరదృతువులో వచ్చేవి కనుక దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగానూ పేరొందాయి.
🍁భూలోకంలో అసురశక్తులు విజృంభించినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, లోక కల్యాణం కోసం దుర్గాదేవి పరాశక్తిగా అవతరించి తన లక్ష్యాలను సాధిస్తుందన్నది ఆర్షవాక్కు. దుర్గ నామంలో ‘ద’ కారం దైత్య నాశకం. ‘ఉ’ కారం విఘ్ననాశకం. కారం రోగనాశకం. ‘గ’ కారం పాపనాశకం. ‘ఆ’ భయ శత్రునాశకమైన శక్తి వాచకం. అందుకే దేవికి పర్యాయపదమైన ‘దుర్గా’ శబ్దాన్ని స్మరిస్తే పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడని బ్రహ్మ మార్కండేయ మహామునికి వివరించాడు. దుర్గాదేవిని కష్టాలను తొలగించే దేవతగా ‘మహానారాయణోపనిషత్తు’ పేర్కొంది. విభిన్న ప్రయోజనాల కోసం పరాశక్తి అనేక పేర్లు, రూపాలు ధరిస్తుంది. రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు తొమ్మిది అవతారాలు ధరించిందని చెబుతారు. అందుకే ఆ దేవిని తొమ్మిది రూపాల ఆరాధిస్తారు.
🍁దుర్గాదేవి తొలి నామం శైలపుత్రి. కమలం, శూలం ధరించి కోరిన కోరికలు తీర్చే తల్లి. అందుకే తొలిరోజున ఈ దేవిని కొలుస్తారు. రెండో రూపం ‘బ్రహ్మచారిణి’. కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం కలిగి శ్వేత వస్త్రధారిణిగా శోభిల్లే ఈమెను పూజిస్తే ఏకాగ్రత కలుగుతుంది. అమ్మవారి మూడో నామం చంద్రఘంట, ధనుస్సు, గద, శూలం, పాశం మొదలైన ఆయుధాలు ధరించి పది చేతులతో కనిపించే ఈ దేవిని ఆరాధిస్తే శత్రువులను జయించే శక్తినిస్తుందని విశ్వాసం. జగన్మాత నాలుగో పేరు కూష్మాండ, చక్రం, గద, బాణం ఒక వైపు; కమండలం, అమృతకలశం, జపమాల, పద్మం వంటివి మరోవైపు ధరించి ఉంటుంది. ఎనిమిది భుజాలతో దర్శనమిచ్చే ఈ దేవిని కొలిస్తే ఆరోగ్యం వృద్ధి చెందుతుందంటారు.
🍁దేవి అయిదోరూపమైన స్కంధ మాతను పూజిస్తే శాంతి సౌభాగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఆరో రూపం కాత్యాయని వాహనం సింహం. ఆ తల్లిని ఆరాధించడం ద్వారా రోగాలూ కష్టాలనుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతారు. అమ్మవారి ఏడో నామం కాళరాత్రి విరబోసుకున్న తల, నల్లని మేనిరూపు కలిగిన ఈ దేవి దుష్టులకు భయంకరీ శిష్టులకు అభయంకరి. దేవి ఎనిమిదో రూపం మహాగౌరి. వృషభ వాహిని. శ్వేత వస్త్రధారిణి. చతుర్భుజాలు కలిగి అభయ, వరద ముద్రలతో దర్శనమిస్తుంది. అమ్మవారి తొమ్మిదో నామం సిద్ధిధాత్రి. కమలాసని అయిన ఆ దేవిని పూజిస్తే సర్వసిద్ధులను ప్రసాదిస్తుందంటారు.
🍁నవరాత్రులన్నీ ముఖ్యమైనవే అయినా మహాష్టమి, మహార్నవమి, విజయదశమిని అత్యంత పవిత్ర దినాలుగా భావిస్తారు భక్తులు. సకల ప్రాణులను అన్ని వేళలా ఆదుకునే దుర్గాదేవిని శరన్నవరాత్రు ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఇవి కూడా చదవండి…