మధ్యప్రదేశ్‌లో అవినీతి శృంఖలతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ జి.పి. మెహ్రా వార్తల్లో నిలిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లపై సోదాలు నిర్వహించగా, భారీ స్థాయిలో నోట్ల కట్టలు, బంగారం, వెండి, ఎఫ్‌డీలు, విలాసవంతమైన వాహనాలు బయటపడ్డాయి.
భోపాల్, నర్మదాపురం ప్రాంతాల్లోని ఇళ్లలో రూ. 35 లక్షల నగదు, సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ. 56 లక్షల ఎఫ్‌డీ పత్రాలు స్వాధీనం చేశారు. అంతేకాక, ఆయన ఫార్మ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె, నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, వ్యక్తిగత కొలను, అనేక విలాస వాహనాలు, గోశాల, ఆలయం లాంటి సౌకర్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఆయన కెటి ఇండస్ట్రీస్ పేరిట పలు బినామీ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో దొరికిన ఆస్తుల మొత్తం విలువ లెక్కించడానికి అధికారులు నోట్ల లెక్కింపు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అవినీతి దర్యాప్తుల్లో ఇదే అతిపెద్ద కేసుగా లోకాయుక్త అధికారులు పేర్కొన్నారు.