< 1 Min

DRDO New Milestone: భారత్‌ రక్షణ రంగంలో మరో మైలురాయిని నమోదు చేసింది. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ (MCPS) ను 32,000 అడుగుల ఎత్తు నుండి విజయవంతంగా పరీక్షించింది. భారత వైమానిక దళ సైనికులు ఈ ఎత్తు నుండి ఫ్రీఫాల్ జంప్ చేసి పారాచూట్‌ బలం, భద్రత, నమ్మకమైన డిజైన్‌ను నిరూపించారు. ఇది 25,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉపయోగించగల భారతదేశంలోని తొలి పారాచూట్ వ్యవస్థగా గుర్తింపు పొందింది.

ఈ వ్యవస్థను DRDOకి చెందిన రెండు ప్రయోగశాలలు — ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE) మరియు బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ (DEBEL) సంయుక్తంగా రూపొందించాయి. MCPS తక్కువ వేగంతో ల్యాండింగ్‌ చేయడం, మెరుగైన దిశ నియంత్రణ, అలాగే NavIC ఆధారిత నావిగేషన్‌ సిస్టమ్‌ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇది సైనికులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా కచ్చితమైన ల్యాండింగ్‌లు చేయడానికి సహకరిస్తుంది.

ఈ విజయంతో భారత్‌ ఇకపై విదేశీ పారాచూట్‌ వ్యవస్థలపై ఆధారపడనవసరం ఉండదు. యుద్ధ సమయాల్లో కూడా దీని నిర్వహణ దేశంలోనే సులభంగా జరుగుతుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయంపై DRDO, వైమానిక దళం, పరిశ్రమలను అభినందించారు. DRDO చీఫ్ డాక్టర్ సమీర్ వి. కామత్ ఈ ప్రాజెక్టు భారతదేశ స్వావలంబన దిశగా ఒక కీలక అడుగు అని పేర్కొన్నారు.