గయ ప్రయాగ
గంగాస్నానం, గయాశ్రాద్ధం హిందువుల కర్మకాండలో చాలా ముఖ్యమైనవి. గంగాస్నానం కోసం కాశీకి వచ్చిన ఆస్తికులు గయకు వెళ్ళి విష్ణుపాదంలో పిండ ప్రదానం చేసితీరుతారు. కాకతాళీయంగా ఈ రెండు క్షేత్రాలూ (కాశి-గయ) బౌద్ధమతస్థులకు కూడా పవిత్ర తీర్థాలయినాయి. కాశీకి సమీపంలో సారనాథ్, గయకు సమీపంలో బుద్ధ బోధ) గయ ప్రపంచంలోని బౌద్ధులకందరికీ తప్పక చూడవలసిన పుణ్యక్షేత్రాలు. ఇది కాక బుద్ధ భగవానుడు జన్మించిన లుంబిని (నేపాల్), పరి నిర్వాణం పొందిన పుర్) కూడా బౌద్ధులకు పవిత్ర క్షేత్రాలే. బుద్ధావతారం శ్రీమహావిష్ణువు దాల్చిన కుశినగరం (గోరఖ్ దశావతారాలలో ఒకటి కాబట్టి ఈ క్షేత్రాలు హిందువులకు కూడా సేవింపదగినవే. గౌతమ బుద్ధుడు సిద్ధార్థదశలో ఉన్నపుడు అక్షయవటం క్రిందనే తన తపస్సు ఆరంభించి తన సాధనా స్థలం చేసుకున్నారని ప్రతీతి. ఏది ఎలా వున్నా కాశీ, గయ రెండూ హిందూ బౌద్ధ మతస్థులకు సరిసమానంగా పుణ్యక్షేత్రాలు.
ముఖ్యంగా పితృకార్యాలకే పరిమితమయిన క్షేత్రమయినప్పటికీ గయను గురించిన ప్రసక్తి అగ్ని, గరుడ, వాయు పురాణాలలో విపులంగా కనిపిస్తుంది. త్రిపురాసుర తనయుడైన గయాసురుడు ఈ క్షేత్రానికి మూల పురుషుడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. అతన్ని చూస్తేనే ప్రజలకు మరణానంతరం పుణ్యలోకాలు లభించేవి. అతని మహిమను చూచి దేవతలు కూడా అసూయపడ్డారు. చివరకు అతన్ని భూగర్భంలో స్థిర నివాసం చేసేట్టు చేశారు. చివరకు అతని శరీరం సోకితేనే జీవికి పుణ్యలోకాలు ప్రాప్తించేవరం విష్ణు మూర్తి అతనికి ప్రసాదించాడు.
ఇప్పటికీ గయాక్షేత్రంలో ఫల్గు నదీతీరంలో అతడు శయనించి వుంటాడు. ఆ నదీతీరంలోనే విష్ణుపాదం ఉంది. అక్షయవటం కూడా అక్కడనే ఉంది. ఫల్గునది దాదాపు ఎండినట్టే ఉంటుంది. కాని కొంచెం తవ్వితే నీరు ఊరి వస్తుంది. ఆ నదిలో సాన్నం చేసి అక్షయవటం క్రింద పిండప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారని క్షేత్ర మహత్మ్యం. ఒక్కసారి గయలో శ్రాద్ధం పెడితే మరియిక శ్రాద్ధం పెట్టవలసిన పని లేదని శాస్త్రాలు చెబుతాయి. ఇప్పటికీ ఎక్కడ తర్పణం చేసినా ‘గయాయాం దత్తామస్తు’ (ఇది గయకు చెందాలి) అని ఆస్తికులు కోరుకుంటారు. గంగా తీరంలో దహనసంస్కారం గయాక్షేత్రంలో పిండప్రదానం చాలా పవిత్రకర్మలుగా హిందువులు భావిస్తారు.
కాశీలో వలె గయలో కూడా తమకు చాలా ఇష్టమైన వస్తువును విసర్జించటం ఒక పరిపాటి. త్యాగబుద్ధిని అలవరచుకునేందుకు ఈ ఆచారం ఉపకరిస్తుంది.
శ్రీ విష్ణుపాదాలు ముద్రితమైవున్న ఆలయం కూడా చాలా దివ్యంగా ఉంటుంది. ఆలయంలో శేషతల్పం మీద శయనించి వున్న విష్ణుమూర్తిని చిత్రించిన ప్రాచీన కళాఖండం కమనీయంగా ఉంటుంది. విష్ణుపాదాలయానికి కొద్ది దూరంలో బ్రహ్మయోని, మాతృయోని అని రెండు కొండ గుహలు వున్నాయి. ఈ గుహలలో ప్రవేశించి బయటకి వస్తే జననమరణాల బాధ మరి వుండదని అంటారు.
ఇంత మహిమగల పుణ్యక్షేత్రం కాబట్టే గౌతమ బుద్ధుడు ఇక్కడ బుద్ధభగవానుడుగా రూపొంది. పరిపూర్ణమైన జ్ఞానాన్ని తాను పొంది తన తోటి ప్రపంచానికి అందజేయగలిగారు. ఆ మహానీయునికి జ్ఞానోదయం ప్రసాదించిన రావి చెట్టు బోధివృక్షం అయింది. అక్కడనే మహాబోధి మందిరం వెలసింది. ప్రపంచంలోని బౌద్ధలకందరికీ ఇది యాత్రాస్థలమయింది. ఈ ఆలయంలో బుద్ధ విగ్రహంతో పాటు శివలింగం కూడా ఉండటం విశేషం. బోధి వృక్షంలోని మొక్కలే శ్రీలంకకు కూడా చేరి అశోక చక్రవర్తి కుమార్తె అయిన సంఘమిత్రకు స్ఫూర్తిని ప్రసాదించాయి. అదే అక్కడి అనూరాధపురం.
మహాబోధి మందిరంలోని ప్రతి అణువూ, ప్రతికణమూ బుద్ధ భగవానుని సిద్ధిసాధనల చరిత్రను చాటి చెబుతుంది. ఆయన కూర్చున్న చోటు వజ్రాసనమయింది. ఆయన తదేకదృష్టితో చూచిన తావున ‘అనిమేషలోచన స్తూపం’ వెలిసింది. ధ్యాన ముద్రలో ఆయన తిరిగిన భూమి ‘చక్రము చైత్యం’ అయింది. ఆత్మజ్యోతిని పలువన్నెలలో ప్రసరించిన ప్రదేశం ‘రత్నగర్భచైత్యం’ అయింది. ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఈనాడు కూడా నిష్టాపరులు లక్షల కొలది ప్రదక్షిణాలు చేస్తారంటే. ఆశ్చర్యం లేదు.
అటు హిందూ మతానికి, ఇటు బౌద్ధమతానికీ ఆరాధ్యమైన గయాక్షేత్రం నిజంగా బుద్ధికి, సిద్ధికి ప్రసిద్ధ నిలయం అని చెప్పుకోవాలి.
గయకు ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు తన శరీరాన్ని తాకిన వారందరూ స్వర్గానికి చేరుకునేలా వరం పొందాడు. దాంతో ప్రజలు అధిక సంఖ్యలో స్వర్గస్తులు కావటంతో, యమలోకంలో పాపులు లేక యముడు తన పదవి పోతుందని భయపడ్డాడు. అప్పుడు దేవతలందరూ కూడబలుక్కుని, గయాసురుని వద్దకు వెళ్లి, యజ్ఞం చేయడానికి అతడి శరీరంపై కొంచెం చోటు కావాలని అర్థించారు. గయాసురుడు సరేనన్నాడు. దేవతల యజ్ఞం ముగిసిన తరువాత గయాసురుడు లేవబోగా, యముడు పెద్ద బండతో అతడి తలను అదిమి పెట్టాడు. ఇతర దేవతలు అతడి శరీరంపై కూర్చుని, అదిమి పెట్టారు. అప్పుడు గయాసురుడు, తాను ఇక లేవడానికి ప్రయత్నించనని, అయితే ఆ ప్రదేశానికి తన పేరు పెట్టాలని, అక్కడ పిండ ప్రదానాలు చేసేవారికి తమ పూర్వీకులు, పిల్లలతో సహా స్వర్గప్రాప్తి కలగాలని వరాలు పొందాడు. విష్ణువు అందుకు అంగీకరించి, గయాసురుడి శరీరంపై ఒక పీఠాన్ని ఉంచి, దానిపై తన పాద ముద్రలు ఉంచాడు. ఇదీ విష్ణుపాద ఆలయం వెనుక నున్న కథ. వాయుపురాణంలో కూడా ఈ కథ ఉంది.
బుద్ధగయ
గయకు ఏడు మైళ్ల దూరంలో బుద్ధగయ ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ జ్ఞానోదయం పొందటంతో ఈ ప్రదేశానికి బుద్ధగయ అని పేరు వచ్చింది. ఇక్కడ బ్రహ్మాండమైన దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని మొదట అశోక చక్రవర్తి నిర్మించినట్టు చెపుతారు. ఇక్కడ కూర్చుని ఉన్న బ్రహ్మాండమైన బుద్ధుడి మూర్తి ఉంది. ఆలయానికి ఉత్తర దిక్కున జ్ఞాన వృక్షం (బోధి వృక్షం) ఉంది. ఈ వృక్షం కిందనే బుద్ధుడు పద్మాసనంలో కూర్చుని తపస్సు చేయగా జ్ఞానోదయం కలిగింది.
బీహార్ ముఖ్యపట్టణమైనం పాట్నాకు 122 కిలోమీటర్ల దూరంలోని సుల్తాన్గంజ్లో జాహ్క ముని ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం గంగానదీ మధ్య నుండి ఉద్భవించిన కొండపై ఉంది. జాహ్న మున్యాశ్రమానికి సంబంధించి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది.
పితృదేవతల భస్మరాసులపై గంగను పారించటం ద్వారా వారికి శాపవిమోచనం కలిగించడానికి ఇక్ష్వాకు వంశీయుడైన భగీరథుడు పరమేశ్వరుని ప్రార్ధిస్తాడు. పరమేశ్వరుడు కరుణించి తన జటాజూటం నుండి గంగను విడువగానే, పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన గంగ, ఈ ప్రాంతంలో ఉన్న జాహ్న మహర్షి ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. అగ్రహించిన మహర్షి గంగను తన దోసిట పట్టి, తాగేస్తాడు. ఈ పరిణామంతో ఖిన్నుడైన భగీరథుడు మహర్షిని ప్రార్థించగా, మహర్షి తన చెవి నుండి గంగను విడిచి పెడతాడు. అందువల్ల ఇక్కడ గంగను జాహ్నుని పుత్రిక జాహ్నవిగా భావిస్తారు.
పాట్నాకు 25 కిలోమీటర్ల దూరంలోని సోనేపూర్లో ప్రసిద్ధి పొందిన హరిహరనాథ దేవాలయం ఉంది. ఈ పట్టణంలోని శోణీ నదిలో కార్తీక పూర్ణిమనాడు దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని శ్రీరాముడు స్వయంగా నిర్మించాడని భక్తుల విశ్వాసం. శ్రీమద్భాగవతంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన గజేంద్ర మోక్ష ఘట్టం ఈ నదితీరానే జరిగిందని భక్తులు భావిస్తారు. ఈ రాష్ట్రంలోని బీహారీ షరీఫ్ సమీపంలోని బారాగావ్లో ఉన్న ఆదిత్య దేవాలయం కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ భక్తులు భక్తి ప్రపత్తులతో సూర్యభగవానుని పూజించి, తరిస్తారు.
గయా విష్ణుపాదాలయం
గయ అనగానే మనకు పిండ ప్రధానం చేసే క్షేత్రం గానూ, అనైతికత రాజ్యమేలే అపర ప్రదేశంగానూ గుర్తుకొస్తుంది. కానీ ఈ పట్టణానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. క్రీ.పూ. నాటి నుంచే ఇక్కడి ఫల్గుణీ నది స్నానం గురించి, విష్ణుపాద ఆలయం గురించీ ఎంతో గొప్ప ప్రాశస్త్యం కలిగిన ప్రదేశంగా మన దేశానికి విచ్చేసిన విదేశీ చరిత్రకారులు గుర్తించి, వారి రచనల్లో వర్ణించారు.
అహింసామూర్తి బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర ప్రాంతం ఇక్కడికి 20 కి.మీ. లోపలనే ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగిన పురాతన శివాలయం ఒకటి ఉన్నది. రైల్వేస్టేషనుకి 4 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామిని ‘శివ’ అంటారు. తల్లి భాగేశ్వరి బగళాదేవి. పవిత్ర ఫల్గుణీ నదీ తీరంలో ఉన్నదీ ఊరు. ఈ ఆలయమే కాక ఇక్కడీ మంగళగౌరీదేవి ఆలయం కూడా ఉంది.
‘గయాయాం-మాంగళ్య కారికే’ అని అమ్మవారి అష్టాదశ పీఠాల్లో చెప్పబడే ఆలయం ఇదే. పితృగయా, శీర్షగయా అనికూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. వారణాశి నుంచి రైలులో ఈ ప్రదేశం చేరవచ్చును. కాశీ, కలకత్తాల మధ్య లూపు లైనులో ఉన్నదీ ఊరు.