మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది.

ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ, అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు.

అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, క్రుంగిపోవడాలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాప్రయత్నాలు, మానసిక క్షోభ, కుటుంబంలో కలహాలు, పిల్లలు పుట్టకపోవడం, అనేకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మవ్యాధులు, ఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింట కష్టాలు, భర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. అందువలన ఏ నిర్మాణమునైనా సరైన వాస్తు రీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి.

కొన్ని గృహాలు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు. అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్పవచ్చు. మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా వుండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాల్సిందే.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి..? ఎన్ని గుమ్మాలు ఉండాలి..? ఎక్కడెక్కడ వుండాలి..? కిటికీలు ఎక్కడ ఉండాలి..? వగైరాలన్నీ ముందే వాస్తు పండితుల్ని సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో, ఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృద్దులు, బాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్ప, దేవతా, ఋషి శాపాలు ఉన్న ఇంట, పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే. ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు. మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు.