అర్జునుడు భగవంతుడిని ఈ విధంగా ప్రశ్నించాడు!

” ఓ కేశవా! స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఉంటాయి? అతడు ఎలా మాట్లాడతాడు?ఎలా నడుచుకుంటాడు? ఏరీతిగా ఉంటాడు? తెలుసుకోవాలి అనుకుంటున్నాను!” అని అడిగెను!

శ్రీక్రిష్ణుడు –” ఓ అర్జునా! ఎవడైతే అన్ని కోరికలను వదిలి ,ఆత్మలో చిత్తాన్ని నిలుపుతాడో….ఆ చిత్తంలో అన్నింటిని సమాన ద్రుష్టితో చూస్తాడో…., దు:ఖానికి కుంగక, సుఖానికి పొంగక…రాగ,భయ,క్రోధములు వీడిన వాడిని ,ఇంకా లోక విషయాలపై ఆసక్తి లేనివాడిని,ప్రియ,అప్రియముల నిశ్చలంగా స్థిరంగా ఉండువాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు!

తాబేలు తన అవయవములు లోపలికి ముడుచుకున్నట్లే….యోగి తన ఇంద్రియములను విషయముల నుండి మరల్చి స్థిరమదిన ఉండే వాడిని స్థితప్రజ్ఞుడు అని అంటారు!

బయటి విషయాల ఆసక్తి ఇంద్రియముల చేత లోపలికి స్వీకరించకుంటే అవి తగ్గును కాని విషయ జ్ఞాపకాలు పోవు! ఆత్మానుభవంలో మెల్లిగా మనస్సు ఆవిషయ వాసనలవైపు నుండి తొలగి మనసు నిర్మలమవుతుంది!” అని అర్జునుడితో చెప్పెను!

ఈ యుగంలో మనం స్థితప్రజ్ఞత సాధించగలమా? అనే ప్రశ్న కొందరికి వస్తుంది! కొందరికి ఈ స్థితప్రజ్ఞత అంటే ఏమిటో అర్థం కాదు! ‘ఎవరైతే కోరికలను వదులుతాడో’….అంటే దాని అర్థం ఏ పనులు చేయకుండా ఉండడం అని కాదు! మన జీవితాల్లో చేసే పనులు చేస్తు వాటిపై మనసు లగ్నం చేయకుండా,వాటి గురించే అనవసరంగా ఆలోచిస్తూ ఉండకుండా,ఆ పనులపై ఉన్న కోరికలను వదిలేసుకొని ,మదిని ఆత్మలో నిలిపి,అన్నింటిని సమానంగా చూడాలని అర్థం! ఒక పనిపై విపరీతమైన ప్రేమ, మరో దానిపై భయం,మరో దానిపై కోపం ఇలా బిన్నంగా ఉండకుండా అన్నింటిని సమభావంగా చూడాలి!

పైన తాబేలు చేసినట్టు మన కళ్లు,నోరు,ముక్కు,చెవులు,కాళ్ళు,చేతులు మనం లోపలికి ముడవలేం కాని మన మనస్సు ద్వారా ఇంద్రియాలను నిగ్రహించవచ్చు! ఇంద్రియాలు మన అదుపు తప్పాలన్నా మనసే!అవి మంచిగా అదుపులో ఉండాలన్నా మనసే! మనసు విషపు కోరలున్న పాములాంటిది,అలాంటి పాములు మనతో ఉండనిస్తే అది ఏదో ఒకరోజు విషంతో కాటేసే ప్రమాదం ఉంది! అదే పామును నేర్పరితనంతో కోరలు పీకేస్తే మనం దానితో ఎలా ఉన్నా ప్రమాదం ఉండదు! అలాగే మనిషి కూడ కోరికలు అనే కోరలు కలిగిన మనసును యోగ నైపుణ్యంతో వదిలేస్తే జీవితం ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా సజావుగా సాగుతుంది. మన మనసుకి భగవద్గీత సారాన్ని గ్రహించేలా చేసి,గీతలో చెప్పినట్టు ఇంద్రియ నిగ్రహము చేయిస్తే మోక్షానికి అర్హుడువి అవుతావు!

ఎప్పుడైతే అన్నింటిని సమముగా చూడడం అలవాటు చేసుకుంటావో అప్పుడు బయటి విషయాలు నీ ఇంద్రియాల ద్వారా లోపలికి నిన్ను కలవరపరిచేలా చేరవు! అలా చేరనప్పుడు మెల్లిగా లోపల కూడా బయటి విషయాలు ఆలోచించవు! అప్పుడు కల్లోల కడలిలా అనవసర ఆలోచనలు నీ లోపల జరగనపుడు అలలు లేని ఏరులా మనసు ప్రశాంతంగా నిశ్చలం అవుతుంది!అప్పుడు పరమానందం నీలో ప్రవహించడం మొదలవుతుంది!

(భగవద్గీత 2-54 నుండి 2-59 లో గల శ్లోక భావాల ఆధారంగా…!)