ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకల్లా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, వినతులు సేకరించిన ఈ సబ్ కమిటీ త్వరలో చర్చించి తుది నివేదికను సమర్పించనుంది. పెద్దగా మార్పులు లేకపోయినా, రెండు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 2026 నుంచి జనగణన ప్రారంభమవుతుందన్న కారణంగా 2025 డిసెంబర్ 31లోపు జిల్లాల సరిహద్దుల మార్పులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై పరిశీలన జరుగుతోంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగుంటపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఈ జిల్లా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని సూచనలు ఉన్నాయి.

అమరావతి కేంద్రంగా ప్రత్యేక అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ, పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అలాగే గుంటూరు జిల్లాలో గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలతో కొత్త జిల్లా రూపుదిద్దుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కలిపితే మొత్తం ఏడు నియోజకవర్గాలు అవుతాయి. దీంతో కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి.