భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
సెప్టెంబర్ 11,2025
✍️దుర్గా ప్రసాద్

రామవరం మాత శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన స్టోర్‌లో నిల్వ ఉంచిన ఔషధాల లభ్యత, నాణ్యత, గడువు తేది, ఆసుపత్రులకు సరఫరా ప్రక్రియలను పరిశీలించారు. రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తనిఖీ సందర్భంగా సెంట్రల్ మెడికల్ స్టోర్ సిబ్బంది కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. ప్రధాన రహదారి నుండి స్టోర్‌కు వచ్చే రహదారి మరమ్మత్తులు చేయాలని, స్టోర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వ రాకులు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చాలని కోరగా స్పందించిన కలెక్టర్ అవసరమైన అన్ని సదుపాయాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

స్టోర్‌లోని ఒక హాల్ ఫ్లోరింగ్ పనులు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ పనులను పూర్తిచేయడానికి అవసరమైన వ్యయంపై తక్షణమే నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించి, ఫ్లోరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాడుకలోకి తేవాలని సూచించారు.

కలెక్టర్ గారు మాట్లాడుతూ… ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మెడికల్ స్టోర్ల సమర్థవంతమైన నిర్వహణ అత్యంత కీలకమని, అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మందులు కొరత రాకుండా సంబంధిత అధికారులు అవసరమైన ఇండెంట్లు సకాలంలో పంపించాలి, ప్రతి రోగికి అవసరమైన ఔషధాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా కృషి చేయాలని ఆయన సూచించారు.

ప్రతి అధికారికి, సిబ్బందికి ప్రజా ఆరోగ్యం అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని, వైద్య రంగంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ అధికారి రామచందర్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.