భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
సింగరేణి సెప్టెంబర్ 01,2025
✍️దుర్గా ప్రసాద్

సింగరేణి సంస్థలో డైరెక్టర్ ఈ అండ్ ఎం గా నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ… సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో ఈ అండ్ ఎం శాఖ ఎంతో కీలకమైన పాత్ర కలిగి ఉందని, ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ పూర్తి పని గంటలు యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్, థర్మల్ ప్రాజెక్టులతోపాటు ఇతర రంగాల్లోకి విస్తరిస్తోందని, ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు.తనపై నమ్మకం ఉంచి సంస్థలో ఉన్నత స్థానానికి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి మోకాళ్ల తిరుమలరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంస్థ లక్ష్యాలకు కట్టుబడి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు తమ శాఖ సమర్థంగా పనిచేసేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా గిరిజనుల్లోని కోయ తెగ కు చెందిన అధికారికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.