localnewsvibe

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం!

యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లోకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.

వీటిలో ఒకటి నుంచి ఐదు… ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం…

ఒకటి, పన్నెండు: శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగు పడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు : జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది : రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది: వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిది : గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం : మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం : జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

1.నమస్కారాసనం :

(ఓం మిత్రాయ నమ:)

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం :

(ఓం రవయే నమః)

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం :

(ఓం సూర్యాయ నమః)

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం :

(ఓం భానవే నమః )

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం :

(ఓం ఖగాయ నమః)

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం :

(ఓం పూష్ణే నమః)

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం :

(ఓం హిరణ్యగర్భాయ నమః )

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం :

(ఓం మరీచయే నమః)

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం :

(ఓం ఆదిత్యాయ నమః)

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి.

10.పాదహస్తాసనం :

(ఓం సవిత్రే నమః)

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం :

(ఓం అర్కాయ నమః)

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం :

(ఓం భాస్కరాయ నమః)

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.

సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పైన వివరణ ద్వారా ఒకటవ మరియు పన్నెండవ ఆసనాలు ఒకే విధముగా వేయవలసినవి. (నమస్కార ఆసనం).