మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ నుండి ట్రాక్టర్ తో ఎర్రవాగు దాటుతుండగా వరదనీటిలో ట్రాక్టర్ చిక్కికుని తృటిలో రైతు కూలీలు ప్రాణాలను దక్కించుకున్న సంఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ఉప్పొంగుతోంది. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లో పత్తి చేనుకు మందు కొట్టడానికి కన్నెపల్లి మండలం జంగంపల్లి కి చెందిన బోరు కుంట రాజం తన భార్య మరో ఇద్దరు కూలీలతో వెళ్లారు. పనిపూర్తి చేసుకొని రాజం ఆయన భార్య మరో ఇద్దరు కూలీలతో భారీ వర్షంలోనే ట్రాక్టర్ తో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారీ వర్షానికి ఎర్రవాగు వరద ప్రవాహం పెరిగింది. ప్రత్యామ్నాయం లేక ఇంటికి రావడానికి ట్రాక్టర్ ద్వారా ఎర్రవాగు దాటుతుండగా వరదలో ట్రాక్టరుతో పాటు వారు ఎర్రవాగులో చిక్కుకున్నారు. వరద ఉధృతిలో కొట్టుకుపోయే ప్రమాదం నుంచి నలుగురు వ్యక్తులు రెప్ప పాటలో ప్రాణాపాయం నుండి తప్పించుకుని ఒడ్డుకు చేరారు.
ఈ సంఘటన భీమిని మండలంలో కలకలం రేపింది. వరద ప్రమాదంలో ప్రాణాలు తగ్గించుకున్న రైతు కుటుంబం, ఇద్దరు కూలీలు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షానికి ఎర్రవాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ వెలికి తీయాలని ఈ ప్రమాదం నుంచి బయటపడిన బోరు కుంట రాజo కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు అధికారులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతిలో ట్రాక్టర్ కొట్టుక పోతే తీవ్రంగా నష్టపోతానని ఆయన వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ఎర్ర వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్ ను బయటికి తీసేందుకు సహాయక చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చిన్న తిమ్మాపూర్ ఎర్రబాగుపై బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగా గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరద ఉధృతం వాగు దాటడం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంఘటనగా మారిందని, గతంలో వాగు దాటుతున్న క్రమంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వరదలు కొట్టుకుపోయిన సంఘటనలు కోకోళ్లలుగా ఉన్నాయని గ్రామస్తులు అన్నారు.
ఈ ఘటనతోనైనా అధికారులకు ప్రజాప్రతినిధులకు కనువిప్పు కలగాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం అంటే ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరు కనబడుతుంది. ప్రజలకు కనీస రవాణా సౌకర్యాలు కల్పించడం బాధ్యత అనే విషయాన్ని గుర్తించాలి. ఎర్రబాగుపై బ్రిడ్జి లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
