మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ: 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, ఆర్.ఎం.ఓ.లు భీష్మ, శ్రీధర్ లతో కలిసి సందర్శించి వార్డులు, ల్యాబ్, ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వైద్య సేవలు, రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో అవసరం అయినా వైద్య పరికరాల కొరకు అందించిన ప్రతిపాదనలను పరిశీలించడం జరుగుతుందని, ప్రతిరోజు 800 నుండి 1 వేయి మంది ప్రజలు ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటి అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధునాతన సాంకేతిక పరికరాలు, వార్డులు ఇతర అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. రోగులకు అందిస్తున్న ఆహార నాణ్యత పరిశీలించడం జరిగిందని, ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో జ్వరం వార్డును ఏర్పాటు చేసి 150 పడకలను అందుబాటులో ఉంచడం జరిగిందని, బెల్లంపల్లి, చెన్నూర్ లలో గల 100 పడకల సామాజిక ఆసుపత్రులు, లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల సామాజిక ఆసుపత్రిలో జ్వర బాధితుల కొరకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పక్క జిల్లా అయిన ఆసిఫాబాద్, పక్క రాష్ట్రం లోని సిర్వంచ నుండి 4 మంది మలేరియా బాధితులు వైద్య సేవలు పొందుతున్నారని, జిల్లాలో మలేరియా కేసులు లేవని తెలిపారు. బయట నుండి వచ్చిన వారి ద్వారా మలేరియా వ్యాప్తి చెందకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు నీటి నిల్వలను తొలగించడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ పిచికారి చేయడం వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని, వ్యాధుల నియంత్రణపై పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ఎవరికైనా జ్వర లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్స పొందాలని తెలిపారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి, హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి, వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
