మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:29 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
2001 జూలై 29 న బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా కు చెందిన యువకులు కుంటాల జలపాతం విహారయాత్రకు వెళ్ళిన వారిలో 6 గురి దుర్మరణంతో విషాద యాత్రగా మిగిల్చింది.

విహారయాత్రకు వెళ్ళిన యువకులు జలపాతంలో స్నానానికి వెళ్లిన కొద్ది సమయంలోనే ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా జలపాతంలో పెరిగిన వరద ఉధృతికి జలపాతంలో కొట్టుకు పోయి మరణించారు. అప్పట్లో ఈ వార్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనది.
మృతుల్లో 29 వ వార్డు నుండి ఇండిపెండెంటు గా గెలుపొందిన కీర్తి చంద్రమోహన్, నగల వ్యాపారి ఆర్.రామ్ మూర్తి, క్రికెట్ క్రీడాకారుడు బబ్లూ శర్మ, నగల వ్యాపారి సురేందర్ జైన్,నగల వ్యాపారి గంగిశెట్టి గోపి, ఫ్రూట్ జ్యూస్ చిరు వ్యాపారి ఆనంద్ జైశ్వార్ ఉన్నారు. వీరి అకాల మరణంతో బెల్లంపల్లి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

భారీ వర్షాల కారణంగా మృత దేహాలను వెతకడంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ సముద్రాల వేణుగోపాల చారికి బెల్లంపల్లి పట్టణంతో ఉన్న అనుబంధంతో ప్రత్యేకముగా దృష్టి సారించి,24 గంటలు అందుబాటులో ఉండే విధంగా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయించి, ఎప్పటికప్పుడు పరిస్థితి ని పర్యవేక్షిస్తూ మృత దేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు.
మొదటి రోజు రెండు, రెండవ రోజు రెండు, మూడవ రోజు ఒకటి ఐదు గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పది రోజులు తర్వాత ఒక మృతదేహం దొరికింది.
ఈ దుర్ఘటనతో జూలై 29 ని తలుచుకుంటేనే గుబులు పుడుతుంది. ఈ ఘటన అనంతరం అధికారులు కుంటాల జలపాతం వద్ద కట్టు దిట్టమైన ఏర్పాట్లు, హెచ్చరిక సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు.

