హైదరాబాద్,
తేదీ:14 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

హైదరాబాద్: తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) గా విధులు నిర్వహిస్తున్న ఎన్.కిరణ్మయి పదవీ కాలాన్ని పొడిగించాలని, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్.దయాకర్ లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రూప్ 1 అధికారిగా 32 సంవత్సరాల సర్వీస్ అపార అనుభవం కలిగి తెలంగాణా రాష్ట్ర సహకార శాఖలో అడిషనల్ రిజిస్ట్రార్ గా ఉన్న డాక్టర్ ఎన్.కిరణ్మయిని గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2014 లో ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో చీఫ్ ఆడిటర్ స్థాయిలో వారు అతి తక్కువ సమయంలో ఆడిట్ పూర్తి చేయించి 25 ఎపెక్స్ బాడీలు రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో చాలా చురుకుగా వ్యవహరించారు.
తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రటరీ( ఫైనాన్స్) గా గత ఏడాది ఆగస్టు లో బాధ్యతలు చేపట్టిన వెంటనే వారు సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి, ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అవసరమైన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల డైట్, కాస్మొటిక్ ఛార్జీలు, శానిటేషన్ బిల్లులను ఆమోదించారు.
విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలను నేరుగా విద్యార్థుల బ్యాంకు అకౌంట్ లలో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టి నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రిటైర్ అయ్యి 10 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ కు సంబంధించిన కేసులను పరిష్కరించి 175 మంది పెన్షన్ కేసు లను ఆడిటర్ జనరల్ కు పంపించారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్ దరఖాస్తులను పరిశీలించి వారికి లభించవలసిన రూ.1,26, 80,421 లను ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు చెల్లించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సంపాదిత సెలవుల మంజూరు 6,12, 18,24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ ఇంక్రిమెంట్స్ ఆయా ప్రిన్సిపాల్ స్థాయిలోనే మంజూరు అయ్యేటట్లు చేసి అంతకు ముందు జరిగిన తీవ్ర జాప్యాన్ని నివారించడంలో కీలక పాత్ర వహించారు.
జీతాలు వీలయినంత త్వరగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ప్రకటించిన డీఏ బకాయిలు నెలవారి కిస్తులలో అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా ధనం దుబారాను అరికట్టి సంస్థలో ఆర్థిక సంస్కరణలతో పాటు క్రమ శిక్షణకు, పారదర్శతకు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల తో సమన్వయం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఆర్థిక అంశాల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. సంస్థ లో జరుగుతున్న ఆర్థిక సంస్కరణలకు ఆటంకం లేకుండా చూడాలని, అభివృద్ధి కార్యక్రమాలకు సుగమం చేయడానికి వీలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) ఎన్.కిరణ్మయి పదవీ కాలం పొడిగించి, తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో అడిషనల్ సెక్రటరీ ( ఫైనాన్స్) గా కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,ఎస్.సీ అభివృద్ధి శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి, సంస్థ కార్యదర్శి వీ.ఎస్ అలగు వర్షిణి కి తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల సంఘం తరఫున విజ్ఞప్తి చేసారు.
ఇవి కూడా చదవండి…
- ‘బాయిజమ్మ’ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి
- రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు
- హిందూ పండుగలపై ఆంక్షలు సమంజసం కాదు: హిందూ సంస్థల ఆవేదన
- అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్
- తాండూర్ లో అయోధ్య బాల రాముడి రూపంలో దర్శనమిస్తున్న కోదండ గణపయ్య
