మలేరియాపై పోరాటంలో భారత్ చారిత్రక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (IIL), బయోలాజికల్ E లిమిటెడ్ సంస్థలు ICMR లైసెన్స్‌తో దేశంలోని మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “ఆడ్‌ఫాల్సీ వ్యాక్స్” అభివృద్ధి చేశాయి.

ఈ టీకా మలేరియా పరాన్నజీవిని కాలేయం, రక్తప్రవాహంలోకి ప్రవేశించే దశల్లో అడ్డుకుని వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. సాధారణ వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా, రికాంబినెంట్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన ఈ వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యంలో అద్భుతంగా పనిచేసింది. ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతమవగా, త్వరలో క్లినికల్ ట్రయల్స్, పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం కానున్నాయి.

తక్కువ ధరలో, గది ఉష్ణోగ్రత వద్ద తొమ్మిది నెలలు నిల్వ ఉండే ఈ టీకా, ఒకే షాట్‌తో దీర్ఘకాల రక్షణ అందిస్తుంది. నిపుణులు ఇది భారత్‌ను మలేరియా రహిత దేశంగా మార్చే ప్రధాన అస్త్రంగా భావిస్తున్నారు.