చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, టెస్కో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, చేనేత రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల మహిళా శక్తి చీరల పంపిణీ కోసం 4.34 కోట్ల మీటర్ల క్లాత్ అవసరమని, అందులో 3.65 కోట్ల మీటర్లను పవర్లూమ్ కార్మికులు ఇప్పటికే ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇప్పటివరకు 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోడౌన్లకు సరఫరా అయ్యాయని వెల్లడించారు. ఈ ఉత్పత్తి ప్రక్రియలో 6,900 మంది నేత కార్మికులకు 6–8 నెలలపాటు ఉపాధి లభించగా, వారిని నెలకు ₹18,000–₹22,000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. చీరల ఉత్పత్తి, సరఫరాను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
చేనేత కార్మికుల రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. 6,780 మంది నేత కార్మికులు వ్యక్తిగత రుణమాఫీతో లబ్ధి పొందనున్నారని తెలిపారు. తెలంగాణ చేనేత బ్రాండ్ కింద ఇప్పటికే ప్రత్యేక లేబుల్ ప్రవేశపెట్టినట్టు, దీని ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందుతున్నాయని చెప్పారు.
‘నేతన్న భరోసా’ పథకంలో భాగంగా ఈ ఏడాది ₹48.80 కోట్లు కేటాయించామని, చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి ₹18,000, అనుబంధ కార్మికులకు ₹6,000 ప్రోత్సాహకం అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 13,371 మంది నమోదు చేసుకోగా, 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, మొత్తం 18,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల వస్త్ర కొనుగోళ్లు టెస్కో ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలన్నారు. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌కు తరలించే పనులు వెంటనే ప్రారంభించాలని తుమ్మల ఆదేశించారు.