< 1 Min

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో కీలకమైన అడుగు పడబోతోంది. నిజాం కాలం నాటి చరిత్రను మళ్లీ సజీవం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదిలాబాద్‌లో విమానాశ్రయం నిర్మాణానికి సిద్ధమయ్యాయి. 1930లో యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు స్థాపించిన 369 ఎకరాల ఏరోడ్రోమ్ భూమిపై ఇప్పుడు పౌర విమానాలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలు రెండింటికీ సాధారణ రన్ వే ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఎయిర్‌బస్-ఏ320, బోయింగ్-737 స్థాయి విమానాలు ల్యాండ్ అయ్యేలా 2 నుండి 3 కిలోమీటర్ల రన్ వే నిర్మాణానికి అనుమతి తెలిపింది.

విమానాశ్రయానికి మొత్తం 1590 ఎకరాల భూమి కేటాయించనున్నారు. ఇందులో ఆదిలాబాద్ శివారులోని 369 ఎకరాల భూమితో పాటు ఖానాపూర్, అనుకుంట, తంతోలి ప్రాంతాల్లోని భూములను సేకరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఏఏఐ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తూ, రాత్రి సమయంలోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు జరిగేలా సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. విద్యుత్, నీరు, రోడ్లు, భవనాల కోసం 40 కోట్ల రూపాయల వ్యయాన్ని అంచనా వేశారు. మరోవైపు, భారతీయ వాయుసేనకు 50 నుంచి 80 ఎకరాల స్థలం కేటాయించి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటే ఉత్తర తెలంగాణకు కొత్త ఊపిరి లభించనుంది. ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు రవాణా, వ్యాపారం, పరిశ్రమల అభివృద్ధి ఊపందుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు పెరిగి ఉత్తర భారత రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం బలపడనుంది.

ఏడుదశాబ్దాల కల నెరవేరబోతున్న ఈ ప్రాజెక్టుతో అడవుల జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి పంథాలో ముందుకు దూసుకెళ్లనుంది.