< 1 Min

ఉసిరికాయ ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ ఫలం. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల ఇది శరీరానికి మంచి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒక ఉసిరి కాయలో నిమ్మకాయ కంటే ఇరవై రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక ఉసిరి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జలుబు, వైరస్‌ లాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేసి శరీరాన్ని బలంగా చేయుటలో సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైబర్ మూలంగా మలబద్ధకం తగ్గి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చర్మానికి ఉసిరి ఒక వరం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు తగ్గిస్తాయి, చర్మం మెరుస్తూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. జుట్టు మూలాలను బలపరచి చుండ్రు, జుట్టు రాలడం, అకాల తెల్లజుట్టు సమస్యలను తగ్గిస్తాయి. ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకోవడం కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులోని విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు రేటినా ఆరోగ్యాన్ని కాపాడి చూపు మెరుగుపరుస్తాయి.

గుండె ఆరోగ్యానికి ఉసిరి మేలు చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కాబట్టి షుగర్‌ వ్యాధిగ్రస్తులకు లాభదాయకం

ఉసిరిని ఖాళీ కడుపుతో తింటే శరీరం శక్తివంతంగా ఉంటుంది. అయితే అది పరిమిత మోతాదులోనే తీసుకోవాలి, ఎందుకంటే అధికంగా తింటే ఆమ్లత్వం లేదా పొడి చర్మం వంటి సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఉసిరి కాయ ఒకే సమయంలో ఔషధం, రక్షణ మరియు శక్తివంతమైన పోషకాహారం.