< 1 Min

హైదరాబాద్ సిటీలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన స్థానికులను కలచివేసింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 23న ఉదయం సుమారు 7:20 గంటల సమయంలో బేగంపేటలోని ఇంపీరియల్ హౌస్ అపార్ట్‌మెంట్స్ ఎదుట ఉన్న శ్రీసత్య టిఫిన్ అండ్ మీల్స్ సెంటర్ దగ్గర ఓ మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది. స్థానికులు పక్కనే టీస్టాల్ నిర్వహిస్తున్న పండు అనే వ్యక్తికి సమాచారం అందించగా, ఆయన అక్కడికి వెళ్లి ఆ మహిళను గుర్తించారు. ఆమె పేరు లిసా, అసోం రాష్ట్రానికి చెందినవారని తెలిపారు.

పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఇది సాధారణ మరణం కాదని గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక క్వార్టర్ మద్యం సీసా, కొంత ఆహారం కూడా దొరికాయి. పోలీసులు ఇవన్నీ స్వాధీనం చేసుకొని కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. లిసా హత్య వెనుక కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. బేగంపేట ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తూ, నిందితుడి జాడ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.