< 1 Min

పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ చోటు జరగడం ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. అత్యంత భద్రతా వ్యవస్థతో ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియంలో దుండగులు రూ.895 కోట్ల విలువైన నగలు, వజ్రాలను ఎత్తుకెళ్లడం నిపుణులను ఆశ్చర్యపరిచింది.

పరిశీలనలో భాగంగా అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, చోరీలో పాల్గొన్న వారు సాధారణ దొంగలు కాదని, ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలకు పేరుగాంచిన పింక్ ప్యాంథర్స్ గ్యాంగ్ సభ్యులే అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేకత ఏమిటంటే

వీరు అత్యంత తెలివైన, శిక్షణ పొందిన సభ్యులను మాత్రమే ఎంచుకుంటారు. సాధారణ పర్యాటకుల వేషంలో మ్యూజియంలలోకి ప్రవేశించి, భద్రతా వ్యవస్థను చాకచక్యంగా మోసం చేస్తూ విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్తారు. తరువాత ఆ నగలను కరిగించి కొత్త రూపంలో మార్చి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తారు. గత రెండు దశాబ్దాలుగా ఈ గ్యాంగ్ దాదాపు 35 దేశాల్లో రూ.4,000 కోట్లకుపైగా విలువైన ఆభరణాలను దోచుకుందని అంతర్జాతీయ పోలీస్ సంస్థలు చెబుతున్నాయి.

లౌవ్రే చోరీ తర్వాత ఫ్రెంచ్ అధికార యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది. చోరీ జరిగిన వెంటనే మ్యూజియాన్ని మూసివేసి, దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. యూరప్‌ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రాథమిక విచారణలో ఒకటి రెండు అరెస్టులు జరిగినట్లు సమాచారం వచ్చినా, ప్రధాన సూత్రధారులు ఇంకా అదృశ్యంగానే ఉన్నారు.

ఈ సంఘటన మళ్లీ ఒకసారి ప్రపంచంలోని ప్రముఖ కళా ప్రదర్శనల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థలు ఉన్న లౌవ్రేలో కూడా ఇలాంటి చోరీ జరగడం, దొంగల నైపుణ్యం ఎంత అధికమైందో స్పష్టం చేస్తోంది. ఇప్పుడు అందరి చూపు పింక్ ప్యాంథర్స్ గ్యాంగ్‌పై ఉంది వీరిని పట్టుకోవడమే ఫ్రెంచ్ పోలీస్‌కు పెద్ద సవాలుగా మారింది.