తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన నిధులు సమకూర్చటంతో పాటు భూసేకరణ బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఖర్చు తగ్గించేలా ఉండాలని సూచించారు.

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనను కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దానికి అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్లను మరోసారి సమీక్షించాలని కోరారు.

హైదరాబాద్ చుట్టూ 362 కిమీ రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేస్తే మహానగర అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. వికారాబాద్–కృష్ణా, గద్వాల–డోర్నకల్, భూపాలపల్లి–వరంగల్ లైన్‌లను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. కాజీపేట జంక్షన్‌లో ఆధునిక సదుపాయాలు కల్పించాలని, వరంగల్‌తో పాటు హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు స్పష్టం చేశారు.