< 1 Min

దేశీయ ఉత్పత్తి సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడే పాక్‌కి ఈ పరిస్థితి మరింత భారమవుతోంది. మరోవైపు, అఫ్గానిస్థాన్‌లోనూ పాకిస్థాన్ నుంచి సరఫరా అయ్యే ఆహార పదార్థాలు, ఔషధాలు, చక్కెర వంటి ఉత్పత్తుల కొరత నెలకొంది. ఈ ఉద్రిక్తతలతో ఇరుదేశాల ప్రజలు నిత్యజీవనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేయడంతో ఇరు దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది.

పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పాకిస్థాన్ మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. అఫ్గానిస్థాన్ నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే టమాటాలు ప్రస్తుతం కిలోకు 600 పాకిస్థానీ రూపాయలకు చేరాయని స్థానిక మీడియా వెల్లడించింది.

ఇది సాధారణ ధరతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. అలాగే ఆపిల్, ఉల్లిపాయ, బంగాళాదుంప వంటి వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

అఫ్గానిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు రోజూ వందలాది ట్రక్కులు సరుకులు తరలిస్తాయి. కానీ సరిహద్దు మూసివేత వల్ల దాదాపు 5 వేల కంటైనర్లు టోర్ఖామ్ సరిహద్దులో నిలిచిపోయాయి. వీటిలో 5 కంటైనర్ల కూరగాయలు పాడైపోయినట్టు అధికారులు తెలిపారు. సరిహద్దు మూసివేతతో రెండు దేశాల మధ్య వాణిజ్య, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్థంభించాయి.

పాక్–అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఖాన్ జాన్ అలోకోజాయ్ ప్రకారం, ఇరుదేశాల మధ్య ఏటా సుమారు 2.3 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సరిహద్దు మూసివేత వల్ల రోజుకు దాదాపు ఒక మిలియన్ డాలర్ల, అంటే రూ.8 కోట్ల వరకు నష్టం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.