మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:1 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

కనుమరుగవుతున్న కాలువలు పట్టించుకొని అధికార యంత్రాంగం

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డులో ఆంధ్రాబ్యాంక్ ప్రక్క సంధి నుండి ఎస్.బీ.హెచ్ ప్రక్క సంధి వరకు పారుతున్న మురికి కాలువను ఆక్రమించి గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సైన్యం నాయకుడు కొలిపాక శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేసారు.

ఆయన మాట్లాడుతూ…, భవిష్యత్తులో వర్షాభావం పెరిగి, క్లౌడ్ బ్లస్టర్ లాంటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ఇలా ఒక్కొక్క మురికి కాలువలను మూస్తూ కబ్జాలు చేసుకుంటూ పోతే, బజార్ ఏరియా మొత్తం నీటి వరదలో మునగక తప్పదని అన్నారు. ఇలాంటి విషయాలలో ప్రజల పక్షాన పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు కూడా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఒక వైపు చెరువులను, నాళాలను రక్షించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ను ప్రవేశ పెడితే, దానికి పూర్తి విరుద్ధంగా బెల్లంపల్లి పట్టణంలో బఫర్ జోన్ లో నిర్మిస్తున్న నిర్మాణాలకు అనుమతులు ఎలా పొందారని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే, లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసినా కూల్చి వేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమపై కొందరు కక్ష గట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమకు ప్రాణ హాని ఉందని, భవిష్యత్తులో తమకు ప్రాణ హాని జరిగితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ మృతదేహాన్ని కూడా మెడికల్ కాలేజీ అప్పజెప్పాలని మెడికల్ కాలేజీ అధికారులకు తమ కుటుంబ సభ్యుల సమ్మతితో బాండ్ పేపర్ సమర్పించామని తెలిపారు.