మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది: 6 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

కన్నాల గ్రామ పంచాయతీ భూములు కబ్జాదారులకు కల్పతరువు

కన్నాలలోని 60 సర్వే నంబర్ లో గల 55 ఎకరాల్లో గల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి ~ రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక

బెల్లంపల్లి: శనివారం రైతు కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, బెల్లంపల్లి పట్టణ శివారు ప్రాంతమైన కన్నాల గ్రామపంచాయతీ లోని 60 సర్వే నంబరు నందు 55 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలకు కేటాయించాలని కోరారు.

కన్నాల గ్రామపంచాయతీలో ప్రభుత్వ భూమి ఇతర సర్వే నంబర్లలో వందల ఎకరాలు ఉండడంతో, కొంత మంది బడా వ్యాపారస్తులకు, ప్రజా ప్రతినిధులకు లావని పట్టా చేసి రియల్ ఎస్టేట్ చేసుకొనుటకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, గుట్టలకు పట్టాలిచ్చిన అధికారులను తక్షణమే ఉద్యోగాల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ, అసైన్డ్ భూములు, అనర్హులకు లావని పట్టాలు కేటాయింపు, లావని పట్టాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాల పర్మిషన్ లు ఎలా పొందారని ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో అసైన్డ్ కమిటీలే లేవు, లావని పట్టాలు ఎలా ఇచ్చారని వారు రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.
ఎర్రకుంట చెరువుపై ఉన్నత స్థాయి అధికారులతో నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, యధావిధిగా ఎర్రకుంట చెరువు పనులను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టి, రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని వారు కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల గ్రామ పంచాయతీ ప్రాంతంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ప్రజా ప్రతినిధులు కరోనా కాలాన్ని అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందారని ఆరోపించారు.

భూ మాఫియా కు చెందిన వ్యక్తులు గుట్టను నామ రూపాలుగా లేకుండా చేసి, ఆ మట్టిని అక్కడ ఉన్నటువంటి చెరువులో నింపి చెరువు నామరూపాలు లేకుండా చేసి, ప్లాటింగ్ చేసి విక్రయిస్తున్నారని అన్నారు. దీనికి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా వత్తాసు పలికారని ఆరోపించారు.

ఈ ప్రాంతమంతా బఫర్ జోన్ క్రింద వస్తుందని తెలిసినప్పటికీ, యదేచ్ఛగా తిరుమల హిల్స్ పేరుతో ఫ్లాట్లు చేసి విక్రయించారని అన్నారు. తిరుమల హిల్స్ తో పాటు ఇంకో రెండు పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారని, వీటిపై ప్రజా సంఘాలు లిఖిత పూర్వకంగా పిర్యాదులు చేస్తున్నా,ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వొస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర గనుల,కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ చొరవ తీసుకుని గుట్ట తొలగించుటకు సహకరించిన నాయకులపై, ఫ్లాట్లు విక్రయిస్తున్న తిరుమల హిల్స్ వ్యక్తులపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

కన్నాల గ్రామ పంచాయతీ లో గల సర్వే నంబర్ 60 లో 55 ఎకరాల 18 గుంటలు ప్రభుత్వ భూమిని, ఇతర సర్వే నంబరు గల వందల ఎకరాల ప్రభుత్వ భూమిని, ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ గృహాలకు కేటాయించాలని కోరారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి తలపెట్టే ఆందోళన కార్యక్రమాలకు ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ సంబంధిత అధికారులు బాధ్యత వహించవలసి వోస్తుందని రైతు కార్మికుల సంఘాల వేదిక ద్వారా డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో టి.మని రామ్ సింగ్, ఎండీ.చాంద్ పాషా, అంబాల మహేందర్, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.