మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:22 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థినులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో విద్యనభ్యసిస్తున్న బి. తరుణి (8వ తరగతి) జ్వరంతో, బి. రేవతి (6వ తరగతి) టాన్సిలైటిస్ తో కూడిన జ్వరంతో బాధపడుతుండగా మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినిలు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వీరితోపాటు మరి కొంత మంది వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, మీడియా ప్రతినిధులు ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థినులకు అందిస్తున్న వైద్య సేవలను ఎ.టి.డి.ఓ., పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అవాస్తవ, అనాలోచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్, ఆర్.ఎం.ఓ.శ్రీధర్, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
