< 1 Min

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఓ సహజీవన జంట గొడవ అనుకోకుండా భారీ మాదకద్రవ్యాల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కుటుంబ కలహంగా ప్రారంభమైన ఈ ఘటన చివరకు గంజాయి నిల్వలను బయటపెట్టడంతో స్థానికంగా సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ సమీపంలోని మాన్సా తాలూకా రాణియాపారా గ్రామంలో ఓ జంట లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తోంది. ఇటీవల వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణలో భాగంగా వారి నివాసాన్ని తనిఖీ చేశారు.

ఇంటి తనిఖీల సమయంలో అధికారులు సుమారు 196 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ విలువ ప్రకారం ఈ మాదకద్రవ్యాల విలువ దాదాపు రూ.6.92 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై పోలీసులు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారానికి ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాధారణ కుటుంబ గొడవ విచారణలో భారీ మాదకద్రవ్యాల నిల్వ బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.