ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ప్రాక్టికల్ పరీక్షల్లో కీలక మార్పులు…

ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సెకండ్ ఇయర్‌లో మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని మార్చుతూ, ఇకపై ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త విధానం ద్వారా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు సబ్జెక్టులపై మెరుగైన అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
కొత్త విధానం ప్రకారం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల ప్రాక్టికల్ మార్కులను 30 నుంచి రెండు భాగాలుగా విభజించారు. ఇకపై ఫస్ట్ ఇయర్‌లో 15 మార్కులకు, సెకండ్ ఇయర్‌లో మరో 15 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో చివరి ఏడాదిలో 30 మార్కుల ప్రాక్టికల్ పరీక్షపై విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి తగ్గనుంది.
ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్ నిర్వహించడం వల్ల ప్రయోగాలపై విద్యార్థులకు ప్రారంభం నుంచే అవగాహన పెరుగుతుంది. అలాగే సెకండ్ ఇయర్ నాటికి మరింత ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. థియరీ పరీక్షలు మాత్రం యథాతథంగా 60 మార్కులకే కొనసాగనున్నాయి. దీంతో అకడమిక్ సమతుల్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని బోర్డు స్పష్టం చేసింది.
రెండు సంవత్సరాల్లో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను కూడా బోర్డు నియమించిన ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ల పర్యవేక్షణలోనే నిర్వహించనున్నారు. దీంతో పరీక్షల పారదర్శకత పెరగడంతో పాటు విద్యార్థుల సబ్జెక్టు పరిజ్ఞానం కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
విద్యార్థుల సౌకర్యార్థం ఈసారి ల్యాబ్ మ్యాన్యువల్స్‌ను డిజిటల్ రూపంలో బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అందులో కొత్త సిలబస్, మోడల్ ప్రశ్నాపత్రాలు, ప్రయోగాల విధానం వంటి వివరాలను పొందుపరిచింది. నెలవారీ ప్రణాళిక ప్రకారం ప్రయోగాలు నేర్చుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ప్రాక్టికల్ పరీక్ష సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా రికార్డు బుక్ సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి గంటన్నరగా నిర్ణయించారు. కాలేజీల్లో ల్యాబ్ తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని, అవసరమైన కెమికల్స్, మైక్రోస్కోప్స్ తదితర పరికరాలను సిద్ధంగా ఉంచాలని ప్రిన్సిపాళ్లకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల్లో అక్రమాలకు ఎలాంటి అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.





