మన భారతీయ సనాతన ధర్మ (హిందూ) సాంప్రదాయములో కాలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందు కర్మానుష్ఠానం కోసం కొన్ని పర్వములను నిర్ణయించారు మన పెద్దలు.

ఆ పర్వములను కూడా తిథుల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. ఆ తిథులలో ముఖ్యమైనది “ఏకాదశి తిథి.”

సర్వమూ కాలాధీనం.
“కాలః కలయతా మహమ్” అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది. కాలము శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞతో నడుస్తుందని పెద్దలు సూచించారు.

గృహస్థో బ్రహ్మచారిశ్చ ఆహితాగ్నిస్తథైవచ
ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి

బ్రహ్మచారి,
గృహస్థుడు,
నిత్యాగ్నిహోత్రుడు
ఎవరైనా కావచ్చు,
ఉభయ ఏకాదశులలో భోజనం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది.

ఎంతో నిష్ఠతో ఏకాదశి రోజున ఉపవాసించిన శ్రీ మహా విష్ణువుకు చాలా ఇష్టులు అవుతారు.

సర్వోత్తమ తిథి ఏకాదశి:

కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహదైశ్వర్యవంతుడైనాడని, ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కినాడని, రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొంది, దేవతాకృపకు పాత్రుడై, మోక్షగామి అయినాడని, క్షీరసాగర మథనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయని, వైఖానస రాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని పురాణ ఉవాచ.
ఇక అంబరీష వ్రత ప్రభావం జగద్విదితమే.

“ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్” –
ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి.

ఉపవాసంనాడు…
ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః” –

పాపకృత్యాలకు దూరంగా ఉండి, సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట!

ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి తరించాల్సినదిగా శాస్త్రవచనం.

ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు

1.శుక్ల పక్షము
2.కృష్ణ పక్షము

పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవైనాలుగు ఏకాదశులుంటాయి.

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్ర మండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకల వల్లనే “ఏకాదశి” అనే పేరు సార్థకమవుతుంది.

ప్రతి నెలా అమావాస్యకి, పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులు వొస్తుంటాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టమైన పేరు, విశేషమైన ఫలము విశేషముగా చెప్పబడినది.

రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.

24 ఏకాదశుల పేర్లూ, ఫలాలు, సంగ్రహంగా :

1) చైత్ర శుక్ల ఏకాదశి – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

2) చైత్ర బహుళ ఏకాదశి – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

3) వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడగును.

4) వైశాఖ బహుళ ఏకాదశి – `అపరా’ – రాజ్య ప్రాప్తి.

5) జ్యేష్ఠ శుక్ల ఏకాదశి – ‘నిర్జల’ – ఆహార సమ్రుద్ధి.

6) జ్యేష్ఠ బహుళ ఏకాదశి – `యోగినీ’ – పాపాలను హరిస్తుంది.

7) ఆషాఢ శుద్ధ ఏకాదశి – `దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు).

8) ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ – కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

9) శ్రావణ శుక్ల ఏకాదశి – ‘పుత్రదా’ – సత్ సంతాన ప్రాప్తి.

10) శ్రావణ బహుళ ఏకాదశి – ‘అజా’ – రాజ్యపత్నీ-పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.

11) భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ – (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు దొర్లును కనుక పరివర్తన) యోగసిద్ధి.

12) భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

13) ఆశ్వయుజ శుక్ల ఏకాదశి – ‘పాపాంకుశ’ – పుణ్యప్రదం.

14) ఆశ్వయుజ బహుళ ఏకాదశి – ‘రమా’ స్వర్గప్రాప్తి.

15) కార్తిక శుక్ల ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర నొందిన మహా విష్ణువు మేల్కొనే రోజు) ఙ్ఞానసిద్ధి.

16) కార్తిక కృష్ణ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్ట సంహారం. (మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు).

17) మార్గశిర శుక్ల ఏకాదశి – `మోక్షదా’ – మోక్ష ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

18) మార్గశిర కృష్ణ ఏకాదశి – `విమలా’ (సఫలా) – అఙ్ఞాన నివ్రుత్తి.

19) పుష్య శుక్ల ఏకాదశి – పుత్రదా’ – పుత్ర ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

20) పుష్య బహుళ ఏకాదశి – ‘కల్యాణీ’ (షట్ తిలా) – ఈతి బాధా నివారణం.

21) మాఘ శుక్ల ఏకాదశి – ‘కామదా’ (జయా) –ఫలం= శాప విముక్తి. (ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి).

22) మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకల కార్య విజయం

23) ఫాల్గున శుక్ల ఏకాదశికి – ‘అమలకీ ఏకాదశి’ –ఫలం ఆరోగ్యప్రదం.

24) ఫాల్గున బహుళ ఏకాదశికి – ‘సౌమ్య ఏకాదశి’ అనే పేరు. ఫలం – పాప విముక్తి.

పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి.