అడిగినంతనే అనుగ్రహించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఒకచోట సిద్ధి వినాయకుడిగా, ఇంకోచోట లక్ష్మీ గణపతిగా, వేరేచోట లంబోదరుడిగా.. ఇలా ఊరికో తీరుతో కొలువుదీరి కోర్కెలు నెరవేరుస్తుంటాడు. తెలంగాణలో గజవదనుడి ఆలయాలు అనేకం. స్వయంభువుగా వెలిసిన ఆ క్షేత్రాలు నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని..

చింతలు తీర్చే దేవుడు

దక్షిణాభిముఖంగా కొలువుదీరి, విలక్షణంగా సింధూరం పులుముకొన్న దేవుడు.. రేజింతల్‌ సిద్ధి వినాయకుడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రేజింతల్‌ క్షేత్రం. ఈ ఆలయానికి రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వయంభువుగా వెలిసిన స్వామి విగ్రహం ఏటా నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని చెబుతారు. గణపతిని దర్శించుకొని ఆలయంలో ముడుపు కడితే వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. సంగారెడ్డి, జహీరాబాద్‌ నుంచి రేజింతల్‌కు రవాణా సౌకర్యం ఉంది.

కొండంత స్వామి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఏకశిల వినాయకుడు కొలువుదీరాడు. ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు. దేశంలో ఇంత ఎత్తయిన వినాయకుడి ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. వెయ్యేండ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహాన్ని పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఏర్పాటు చేయించినట్టు తెలుస్తున్నది. పచ్చటి పొలాల మధ్య గంభీరంగా కొలువైన లంబోదరుడి దర్శనం కోసం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఆవంచ క్షేత్రం జడ్చర్ల నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

శ్వేతార్కమూల గణపతి

శ్వేతార్కం (తెల్ల జిల్లేడు) చెట్టును గణపతికి ప్రతి రూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం వందేండ్లు దాటిన శ్వేతార్క వృక్షం మూలంలో గణపతి ఆకృతి వస్తుందని చెబుతారు. వరంగల్‌ పట్టణం కాజీపేటలోని గణపతి ఇలా వేరులో వెలిసిన వేలుపే. తూర్పు అభిముఖంగా కొలువుదీరిన వినాయకుడు సమస్త కోరికలూ నెరవేరుస్తాడని ప్రతీతి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గణనాథుడి సన్నిధి పర్వదినాల్లో వేలాది భక్తులతో కిటకిటలాడుతుంది.

లష్కర్‌ గణపతి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న సిద్ధివినాయకుడి గుడి భక్తుల పాలిట కొంగుబంగారం. రెండు శతాబ్దాల కిందట.. ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో ఓ బావిలో ఈ విగ్రహం దొరికిందన్న కథనం ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి లష్కర్‌ గణపతికి ఏటా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. స్వామి సిద్ధివినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. ప్రధాన ఆలయంలో శివుడు, అమ్మవారు, వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయుడు, శనైశ్చరుడు, రాహు-కేతు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.