localnewsvibe

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.
ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

శ్రీ రామ జనన వృత్తాతం

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

రామనామ విశిష్టత

మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!
‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ ‘శ్రీరాముని’ కనుగొనుచుండవలె.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.
దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని
ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

రామో విగ్రహాన్ ధర్మః

ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడే. *సహజం గా శ్రీ రామాయణం చదివిన వారికీ బాగా తెలుస్తుంది, లేక విన్నవారికి అంతగా తెలిసే అవకాశం లేదు. శ్రీ రాముడు ఏకపత్నీవ్రతుడు అని అందరికీ తెలుసు. కేవలం నోటి మాట కాదు, ఆ విషయం లో రాముడు ఎంత బలమైన నిష్ఠ కలవాడో ఒక్క ఉదాహరణ

రామ రావణ యుద్ధం పూర్తి అయింది, రావణుడు పది తలలు తెగిపోయి పార్థివ దేహం యుద్ధ భూమి లో పడిపోయి ఉంది, భార్య మండోదరి కి కబురు చేశారు, ఆమె వస్తుంది. అప్పటి దాకా యుద్ధం చేసి ఉన్న రాముడు అలా పక్కనే ఉన్న రాతి బండ పై కూర్చుని ఉన్నాడు.

తల తిప్పి చూశారు అందరూ, మండోదరి పరుగు పరుగున వస్తుంది, సాయంత్రం కావడం తో, సూర్య కిరణాలు వాలు గా పడుతున్న కారణం చేత మండోదరి వస్తున్నపుడు ఆమె నీడ అలా వచ్చి రామయ్య కూర్చున్న బండ మీద పడబోతున్న సమయం లో చటుక్కున లేచి పక్కకి వెళ్లి నించున్నాడు రామయ్య.

సీతమ్మ తల్లి తప్ప తన మనసులో, జీవితం లో, లౌకికంగా కూడా కనీసం వేరే స్త్రీ నీడను కూడా రామయ్య తాకలేదు. ఎవరికి సాధ్యం ఒక్క శ్రీ రామచంద్రుడి కి తప్ప ఇటువంటి ధర్మ నిష్ఠ.

అందుకే యుగాలు మారిపోయినా, తరాలు మారిపోయినా కోట్ల సంవత్సరాలు తరువాత కూడా రాముడు అలా చిరస్థాయి గా నిలబడిపోయాడు. అందుకే అన్నారు, రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మాన్ని నిలువెత్తు కుప్ప గా పోస్తే అది ఆరడుగుల ఆజానుబాహుడు రాముడి రూపు గా మారింది అని.

రాముడే ధర్మము – ధర్మమే రాముడు
ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః!!!