ఆంజనేయ స్వామి మూలవిరాట్ గా విరాజిల్లుతున్న మహిమాన్వితమైన  ఆలయం  పంచవటి విశ్వరూప జయమంగళ పంచముఖ ఆంజనేయస్వామి క్షేత్రం. ఈ క్షేత్రం మధ్య తిరుపతి అనే పేరుతో ప్రసిధ్ధి పొందడం ఒక విశేషం.  ఇక్కడ ఒక ప్రత్యేక సన్నిధిలో శ్రీ దేవి ,భూదేవి సమేతుడై  మహావిష్ణువు శ్రీనివాసునిగా  దర్శనానుగ్రహం కలిగిస్తున్నాడు.

2000 వ సంవత్సరంలో పంచవటి క్షేత్ర నిర్మాణ కార్యక్రమాలు ఆరంభించడానికి ముందు శ్రీ నారాయణ పొదువాళ్ అనే జ్యోతిష్య శాస్త్రవేత్త  ద్వారా అష్టమంగళ  దేవప్రసన్నం పరిశీలించబడినది.  అప్పుడు ఈ ఆలయంలో  తిరుమల తిరుపతిలోని  వేంకటేశ్వరస్వామివారు ప్రతిష్టించబడతారని తెలిసింది.

కొంతకాలానికి పంచవటి ఆంజనేయస్వామి వారి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి  ప్రతిష్టించబడే శుభ సమయం ఆసన్నమయింది. ఆ ప్రకారం తిరుమల  నుండి 8 అడుగుల ఎత్తైన శ్రివారి విగ్రహాన్ని తీసుకువచ్చి 2019 సంవత్సరం  మే మాసం 10 వ తేదీన పంచవటి క్షేత్రంలో ప్రత్యేక సన్నిధిలో ప్రతిష్టించడం జరిగింది.

తిరుమల తిరుపతిలో జరిగే దర్శనాలు, సేవలు , ఉత్సవాలు అన్నీ అక్కడి ఆచార ప్రకారమే పంచవటిలో జరుగుతున్నవి.

శ్రీ దేవి , భూదేవి సమేత  శ్రీ నివాసునికి తిరుమలలో జరిపినట్లే  కళ్యాణోత్సవాలు జరుపుతారు. భాద్రపద మాస శనివారాలలో వేంకటేశ్వరునికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజు శ్రీనివాసుడు మోహిని  అలంకరణలో దర్శనమిస్తాడు.

ఆ మరునాడు ఉదయాన 5 గం..కు శ్రీ దేవి,భూదేవి సమేతంగా శ్రీ నివాసుడు  వైకుంఠ ద్వార దర్శనం అనూగ్రహిస్తాడు. పది రోజులపాటు వైకుంఠ ద్వారం భక్తుల దర్శనార్ధం తెరచి వుంచుతారు.

మధ్య తిరుపతిగా ప్రఖ్యాతి చెందిన  యీ పంచవటి తిరుపతి దిండివనం నుండి పాండిచ్చేరి వెళ్ళే మార్గం లో 29.కి.మీ. దూరాన తిరుచిట్రంబలం కూటు మార్గ సమీపమున వున్నది.  అలాగే పాండిచ్చేరి నుండి 11 కి.మీ దూరంలో ఈ పుణ్యక్షేత్రం వున్నది.