తమలపాకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి, అందుకే వీటిని సాధారణంగా పాన్ లేదా తాంబూలంగా తీసుకుంటారు.

భోజనం తర్వాత తీసుకున్నప్పుడు తమలపాకులు జీర్ణక్రియకు సహాయపడతాయి.

అందుకే తాంబూలం సంప్రదాయంగా శుభ సందర్భాలలో భోజనం తర్వాత ఇస్తారు. రకరకాల వంటకాలను ఆరగించిన అతిథులు అజీర్తితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశమే ఈ సంప్రదాయం వెనుకగల కారణం.

అయితే తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే.. దాన్ని మరిగించిన నీటిని తాగడంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రయోజనాలు..
పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి, ఒక గ్లాసు నీళ్లు పోసి, ఒక తమలపాకును ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి.
మలబద్దకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకు నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది.


తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంవల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.


మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.


తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండుటవల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది.
అంతేగాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది.


అయితే తమలపాకు నీటిని ఎప్పుపడితే అప్పుడు తాగడం కూడా మంచిదికాదు. రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.