localnewsvibe

యుగయుగాలుగా వెదుకుతున్నా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలియక అతడు తనకెందుకు కనిపించడని నిరాశతో ప్రశ్నలు వేసే మనిషికి, అతడెవరో ఎక్కడుంటాడో చెప్పగలవారుంటారు. పరమ పురుషులైనవారు కొద్దిమందే ఉంటారు. దేవుడిని వారు ఆకాశంలోనో, దేవాలయాల్లో మాత్రమే వెదకరు. అతడు ఎక్కడో లేడని మనుషుల హృదయాల్లోనే ప్రతిష్ఠితుడై ఉంటాడని వారికి తెలుసు. వారి ఆధ్యాత్మికత అవధులు లేనిది. ధర్మం అనే మాటకు అర్థం చెప్పగలవారందరూ దైవకార్యాలన్నీ త్రికరణ శుద్ధితో మానవసేవే మాధవసేవ ఆచరిస్తూనే, అదే సమయంలో దైవానికి చేసే సేవలు మానవాళికి చేసే సేవలకు తీసిపోవనే ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు. దైవ సాక్షాత్కారం కావించుకుంటారు.


కలియుగంలో కూడా అది సాధించిన మహాజ్ఞాని రామకృష్ణ పరమహంస. ఆయన మహా వేదాంతి. వివేకానందుడికి స్ఫూర్తినిచ్చిన ఆధ్యాత్మిక గురువు. తన శిష్యుడు నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు, ఆహార పానీయాలు తీసుకునేందుకు వెచ్చించే ఆ కొద్ది సమయంలో తప్ప, మిగిలిన కాలమంతా ధ్యానావస్థలో ఉంటూ సమాధి స్థితికి చేరుకుంటూ ఉండటాన్ని ఆయన గమనించారు. ఒకనాడు అతణ్ని పిలిచి ‘ఎందుకు నీకీ ప్రయాస, నీ ముక్తి మోక్షాల కోసమేనా ఇదంతా’ అని అడుగుతారు. గురువు ఎందుకు అలా అడిగారో వివేకానందుడికి అవగతమైంది. తపస్సంపన్నుడికైనా, జ్ఞానసిద్ధుడే అతడైనా, మనిషి శరీరాన్ని భగవంతుడిచ్చింది సమస్త జీవకోటికి సేవలందించే పరికరమై ఉండటానికేనని నర్మగర్భంగా చెప్పడమే ఆయన ఉద్దేశమని అర్థమైంది. మానవసేవ మనుషులందరికీ లభించని అరుదైన అవకాశం. సాటి మనిషికి సహాయపడే ఏ ప్రయత్నంలోనైనా, అతడు నరకానికి వెళ్లవలసిన పరిస్థితులు ఎదురవుతున్నా అక్కడికి వెళ్లి ఆ నరక కూపంలో కూరుకుని ఉన్నవారికి చేయగలదంతా చేసి రావలసిన అవసరముందని గుర్తించాలి. వ్యక్తిగత మోక్షం కోసం చేసే సాధనలతోనే మనిషి నరకాన్ని తప్పించుకోలేడని ఆయన తెలుసుకున్నారు. రామకృష్ణ సేవాశ్రమం స్థాపించారు. మానవసేవ మాధవసేవ అనే మహత్తర సందేశమిచ్చి నినాదంలా విశ్వవ్యాప్తంగా వినిపింపజేశారు.


భగవంతుడు ప్రేమస్వరూపుడు. తన సృష్టిలోని జీవరాసులన్నింటి మధ్యా ఆయన ప్రేమబంధాలే వేసి ఉంచాడు. ప్రేమతో ఆయనకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని అనిపించినప్పుడు- దీనులు, దిక్కులేనివారు పట్టెడన్నం కోసం రాత్రీపగలు పడిగాపులు కాసేవారు, రోగపీడితులు… అటువంటి అసహాయులందరినీ దైవ స్వరూపులుగానే గుర్తించారు. వారికి సరైన సమయంలో అందజేయగల ఆ సహాయం దైవానికి చేసే సేవే అవుతుంది. అది ప్రేమకు ప్రతిరూపమైన ఆ భగవంతుడికే అందుతుంది. సర్వేజనా స్సుఖినోభవంతు అనే సద్భావన చోటు చేసుకుంటుంది. కనిపించే సేవలన్నింటితో దేవుడి కటాక్షమొక్కటే కాదు, అది అందుకుని లాభపడిన అసహాయులందరి నుంచీ హృదయపూర్వకమైన కృతజ్ఞత అప్పటికప్పుడే లభిస్తుంది. మానవసేవ మాధవసేవ. అదే మహదాశయంగా సమాజంలో భాగమై జీవిస్తున్న మనిషికి, అక్కడ ఉన్న పరిస్థితులు ఎటువంటివైనా, సమస్యలమయమై కనిపిస్తున్నా, సరిదిద్దగల దక్షత కలుగుతుంది. మానవుణ్ని మాధవుడిగా మలచడానికి మతం ఒక్కటే సరిపోదని అతడు తెలుసుకుంటాడు. లౌకిక ప్రపంచంలో తన సంచితార్థాలు చూసుకుంటూ మురిసిపోయే అతడికి, వితరణబుద్ధితో సాటి మనుషులకు అందజేసే సేవాసహాయాలు కలిగించే సంతోషం సైతం బ్రహ్మానందంలో భాగమేనని అర్థమవుతుంది!

ఓం నమో నారాయణాయ