తక్షశిలలో బోధిసత్వుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆచార్యుడు . అతని వద్ద 500 మంది శిష్యులు వేదం చదువుకునేవారు . వారిలో ఒక విద్యార్థి పేరు పాపకుడు . “ పాపకా , రా ! – పాపకా ! పో ” “ పాపకా ఇది ఏమిటి ? అంటూ అస్తమానూ పాపకా .. పాపకా .. అంటూంటే అతని కదోలా ఉండేది. ” ఆయిష్మాన్ , పాపకా ! ” అంటూంటే ఏమిటోగా ఉండేది. అతనికి తన పేరు మీద అసహ్యం కలుగుతుండేది. చివరకతను “ పాపక నామము ప్రపంచంలో చాలా చెడ్డది. దురదృష్టాన్ని తెచ్చేది నేను యీ పేరు మార్చుకుని మరో పేరు పెట్టుకుంటాను ” అని నిశ్చయించుకుని – ఆచార్యులయిన బోధిసత్వుడి వద్దకు వెళ్లాడు. వారికి నమస్కరించి ఆచార్యా ! నా పేరు అమంగళకరమయినది. నాకు మరొక పేరు మంచి పేరు పెట్టండి ” అని ప్రార్థించాడు. అప్పుడాయన యిలా చెప్పారు.

“ చిరంజీవి ! పేరనేది మనిషిని గుర్తించడానికే పిలవడానికే దాని ఉపయోగం అంతే తప్ప పేరువల్ల మరే ప్రయోజనమూ లేదు ఉన్న పేరుతో సంతృప్తి అని హితబోధ చేశారు. కాని అతను వినలేదు.

అప్పుడాయన “ నాయనా ! దేశాటనం చేసిరా దేశాటనంలో నీకే పేరు మంగళకరమో తెలిసికొని వస్తే నీకా పేరే మార్చుతాను ” అన్నాడు. పాపకుడు ఆయన వద్ద ఆశీర్వాదమూ సెలవూ తీసుకుని దేశాటనానికి బయలుదేరాడు. ఒకనాడతను తిరుగుతూంటే స్మశానానికి తీసుకుపోబడుతున్న శవం ఎదురయింది. “ చనిపోయిన వారి పేరేమిటి ? ” మెల్లగా అడిగాడు పాపకుడు . “ జీవకుడు ” చెప్పారు వారు. పాపకుడు ఆశ్చర్యంగా ” జీవకుడు పేరున్నా చనిపోతాడా ? ” అని వాళ్లు అడిగాడు. అతన్ని తేలికగా చూసి ” జీవకుడు చనిపోతాడు , అజీవకుడూ చనిపోతాడు.

పేరులో ఏముంది ? చూడబోతే నీకు జ్ఞానం తక్కువలా ఉంది ” అని పోయారు. అక్కడినుంచి వెళ్తూంటే – ఒక మగవాడు భార్యని కొడుతున్నాడు. ఎందుకామెను కొడుతున్నావ్ ? ” అని అడిగాడు పాపకుడు , దానికతను – ” ఇది – ధనపాళి – బత్తెం తేలేదు వంట చెయ్యలేదు. నేను అశక్తుడిని ” అని జవాబు చెప్పాడు. “ ధనపాళి అని పేరుకలిగి కూడా ఒక పూట బత్తెం తేలేకపోయింది ! ” అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు “ ధనపాళికాని నిర్థనపాళికాని ఎవరయినా దుర్గతి పొందవచ్చు పేరు గుర్తింపుకి మాత్రమే… ఈ మాత్రం తెలియదా ? చూడగా నీకు బుద్ధితక్కువ ఉన్నట్లుంది ” అన్నాడు . పాపకుడు మళ్లీ నడవసాగాడు. అతనికీసారి ఒకడు విచారిస్తూ ఎదురయ్యాడు . “ ఎందుకు విచారిస్తున్నావ్ ? ” అడిగాడు . ” తోవ తప్పిపోయాను ” చెప్పాడతను . “ నీ పేరు ? ” “ పాంధకుడు . ” “ పాంధకుడు కూడా తోవతప్పునా ! ” “ తోవతప్పడానికి పాంధకుడయితే ఏమిటి , అపాంధకుడైతే ఏమిటి ? పేరులో ఏముంది ? చూడబోతే నీకు బుద్ధి కొరవడినట్లుంది ” అంటూ వెళ్లిపోయాడు . పాపకుడు ఆచార్యుని వద్దకు వచ్చి జరిగినది చెప్పి పేరుపట్ల జ్ఞానోదయమైందన్నాడు . మనిషిలోనే తప్ప పేరులో ఏమీలేదు.