ఎద్దుమొద్దు కేల యిల వేదశాస్త్రముల్
ముద్దునాతి కేల ముసలి మగడు
చల్ది మిగుల నిల్లు సంసార మేలరా
విశ్వదాభిరామ వినురవేమా !
తాత్పర్యము :
వేదశాస్త్రవిద్యలు ఎద్దునకు అనవసరము.
యువతికి ముదుసలి మొగుడు అనవసరము కదా !
చల్ది అన్నం మిగలని ఇల్లు సంసారుల కొంప అని పిలవబడదు.
ఎన్నగ మనసే కారణ
మన్నిటికిని జూడ జూడ నాత్ముడు తానై
యున్నంత కాల మిలలో
నన్నా యిది తెలియవలయు నవనిని వేమా !
తాత్పర్యము :
మనసే మనిషికి అన్నిటికి కర్మబంధములకు మూలం కాబట్టి మనసెరిగి ప్రవర్తించుట ముఖ్యము. మనసే ప్రధానమైనది.
ఎన్నగ మనసే కారణ
మన్నిటికిని జూడ జూడ నాత్ముడు తానై
యున్నంత కాల మెచ్చట
నున్నను నిది నిజము తెలియ నొప్పగ వేమా !
తాత్పర్యము :
ఆత్మ, మనసు ఒకటే, జీవాత్మ, పరమాత్మ స్వరూపము కనుగొనుటకు ప్రయత్నించవలెను. ఆత్మయే దైవ స్వరూపమగుచున్నది.