“ప్రథమా శైలపుత్రీ బ్రహ్మచారిణీ తృతీయ చంద్రఘంటేతి కుష్మాండేతి చతుర్ధకీ పంచమా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకీ పంచమ స్కంధమాతేతి షష్ట్యా కాత్యాయనీతచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమా సిద్ధి దాత్రీతి నవదుర్గా: ప్రకీర్తత్వా”
అనే పద్యాన్ని అనుసరించి ఆ రూపాలు వరుసగా…
మార్కెండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి తొమ్మిది రూపాలను ధరించింది. ఆ రూపాలకే నవదుర్గలు అని పేరు. నేపాల్ లోని షోవా భగవతీ ఆలయంలో ఈ నవదుర్గల ప్రతిరూపాలుంటాయి. విజయ దశమినాడు అక్కడి వారు ప్రత్యేకంగా అమ్మవారి సన్నిధిలో ‘నవదుర్గ నృత్యం’ చేస్తారు.
శైలపుత్రి
పర్వతరాజు హిమవంతుని కుమార్తె వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ధరించిన శైలపుత్రి. నవదుర్గలలో ఇది మొదటి అవతారం.
బ్రహ్మచారిణి
పరమశివుని భర్తగా పొందేందుకు వేల సంవత్సరాలు తపస్సు చేసిన దాక్షాయణి బ్రహ్మచారిణి’, అందుకు గుర్తుగా జపమాల, కమండలంతో కనిపిస్తుందీ అమ్మవారు.
చంద్రఘంట
శిరసున చంద్రుని దాల్చిన చల్లని తల్లి చంద్రఘంట. వాహనం పులి, ఈ తల్లిని పూజిస్తే భూతప్రేత పివాచాది భయాలు పోతాయని ప్రతీతి.
కూష్మాండ
తన చిరుదరహాసంతో బ్రహ్మండాన్ని సృజించిన అమ్మా, కూష్మాండ బలి (గుమ్మడికాయ) అంటే ప్రీతి కనుక ఆ పేరుతోనే ప్రసిద్ది చెందింది. ఈ దేవి వాహనం పులి.
స్కంధమాత
స్కంధుడుగా పేరొందిన కుమార స్వామి తల్లి కాబట్టి పార్వతీ దేవి స్కంథమాత అయింది. సింహవాహన రూఢ అయిన ఈ తల్లి ఒడిలో షణ్ముఖుని దర్శించవచ్చు.
కాత్యాయని
పార్వతీదేవి తన కుమార్తెగా జన్మించాలంటూ తపస్సు చేసిన కాత్యాయన మహర్షికి జన్మించిన శక్తి స్వరూపిణి. కాత్యాయనీదేవి వాహనం సింహం.
కాళరాత్రి
నవదుర్గలలో ఏడవ దుర్గ. గాడిదను వాహనంగా కలిగిన కాళరాత్రి మిక్కిలి భయంకర రూపిణి, కానీ ఆ తల్లి శుభాలన్న ప్రసాదించే శుభంకరి అని భక్తుల నమ్మిక.
మహాగౌరి
శివుని అర్ధాంగి కావడం కోసం ఘోర తపమాచరించిన సాత్విక శక్తి రూపిణి, వాహనం ఎద్దు. కరుణా కటాక్షాలు ప్రసాదించే చల్లని తల్లి అని భక్తుల విశ్వాసం.
సిద్ధిదాత్రి
శివుడికి సర్వసిద్ధులనూ ప్రసాదించిన దేవత సిద్ధిధాత్రి అని దేవిపురాణం చెప్తోంది. కమలాసనంపై పద్మాసన స్థితిలో కూర్చున్న ఈ దేవి దర్శనంతో కోరికలు సిద్ధిస్తాయి.
శక్తి పీఠాలు
స్త్రీ రూపాన్ని అత్యున్నత స్థాయిలో దైవంగా, శక్తి స్వరూపిణిగా హిందువులు కొలుస్తారు. స్త్రీలోని అత్యంత శక్తినీ, పట్టుదలను చురుకుదనాన్ని సూచించే విధంగా ‘జగన్మాత’గా’ శక్తి’గా ఆమెను పూజిస్తారు. ఇలా ‘శక్తి’ ని పార్వతీ దేవి (లేదా సతి) రూపంలో పూజించే పీఠాలు మన భారత ఉప ఖండంలో 51 ఉన్నాయి. ఇవికాక శక్తి స్వరూపిణిగా వివిధ పేర్లతో దేవతల్ని మన దేశంలో గ్రామ గ్రామానా పూజిస్తారు. ప్రస్తుతం మనం 51 శక్తి పీఠాలు, వాటి ఆవిర్భావం గురించిన కథ కుప్తంగా తెలుసుకుందాం.
దక్ష ప్రజాపతి కూతురైన సతి శివుడిని పెళ్ళి చేసుకుంటుంది. దక్షుడికి ఈ వివాహం ఇష్టం ఉండదు. చర్మాన్ని ధరించి, పాముల్ని మెడలో వేసుకుని, స్మశానాల వెంబడి తిరిగే శివుడిని పెళ్ళి చేసుకోవద్దని వారిస్తాడు. అయినా ఆమె పట్టుదల వదలక శివుడి భార్య అవుతుంది. అప్పుడు దక్షుడు శివుడిని అవమానించేందుకు గాను పెద్ద యజ్ఞం తల పెడతాడు. ఆ యజ్ఞానికి దేవతలందర్నీ పేరు పేరునా ఆహ్వానిస్తాడు. కానీ, తన అల్లుడైన శివుడిని మాత్రం పిలవడు. అయినా సతీదేవి , శివుడు వారిస్తున్నా వినకుండా ఆ యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు ఆమెని అవమానించడంతో భరించలేక అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది.
శివుడు ఈ సంగతి విని కోపోద్రిక్తుడై పోతాడు. వీరభద్రుడిని సృష్టించి, దక్ష యజ్ఞం పూర్తిగా నాశనం చేయిస్తాడు. దక్షుడి తల నరికేస్తాడు, తర్వాత మళ్లీ మేక తల అతికించి అతడ్ని బతికిస్తాడు. అయినా తన బాధనణుచుకోలేక, సతి శరీరాన్ని తీసుకు వెళ్ళి ప్రళయ తాండవం చేస్తాడు. ఆ తాండవ, విలయ నృత్యానికి విశ్వమంతా కంపించిపోతుంది. శివుడిని ఆపాలంటే సతి శరీరాన్ని కనిపించకుండా చెయ్యడమే, ఆ శరీర భాగాలు పడిన ప్రతిచోటా ఒక్కో శక్తి పీఠం ఆవిర్భవించింది.
ఈ పీఠాల్ని వివిధ గ్రంథాల్లో వివిధ రకాలుగా వర్ణించారు. వీటి సంఖ్యను 18 , 51 , 108 గా వేరు వేరు చోట్ల పేర్కొన్నారు. సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల ఏర్పడిన ఆలయాలు కావడంతో ఆయా శరీర భాగాలు వ్యాధిగ్రస్తమైతే ఆ ఆలయాన్ని సందర్శిస్తే తగ్గిపోతుందని భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వీటిలో కొన్ని పీఠాలు తంత్ర, యోగ సాధనలకు ఆటపట్టులుగా కూడా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని విజ్ఞానాన్ని, తెలివితేటల్ని ప్రసాదించే శక్తిగా భావిస్తారు . అస్సాంలోని కామాఖ్య ఆలయం తంత్ర విద్యలకు ప్రసిద్ధికెక్కింది.
ఈ 51 శక్తి పీఠాల్లో సగం బెంగాల్ ప్రాంతంలోనే అంటే 14 మన దేశంలోని పశ్చిమ బెంగాల్ లోనూ, కొన్ని బంగ్లాదేశ్ లోనూ ఉన్నాయి . మిగిలిన వాటిలో కొన్ని శ్రీలంక, నేపాల్, టిబెట్, పాకిస్తాన్ లో కూడా ఉన్నాయి. మన దేశంలో ఉన్న ముఖ్య పీఠాలు ఈ క్రింది ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి.
108 శక్తిపీఠములు
1) విశాలాక్షి (కాశీ)
2) లింగధారిణి (నైమిశారణ్యము)
3) లలిత ( ప్రయాగ )
4 ) కామాక్షి ( గంధమాదనం )
5 ) కుముద ( మానససరోవరము )
6 ) విశ్వకాయ ( అంబర్ )
7 ) గోమతి ( గోమంతపర్వతము )
8 ) కామచారిణి ( మందర పర్వతము )
9 ) మదోత్కట ( చైత్ర రధ వనము )
10 ) జయంతి ( హస్తినాపురము )
11 ) గౌరి ( కన్యాకుబ్దము )
12 ) రంభ ( మలయపర్వతము )
13 ) కీర్తి మత ( ఏకామర క్షేత్రం )
14 ) విశ్వేశ్వరి ( విశ్వము )
15 ) పురుహుత ( పుష్కరము )
16 ) మార్గదాయిని ( కేదారం )
17 ) నంద ( హిమవంతము )
18 ) భద్ర కర్ణిక ( గోకర్ణము )
19 ) భవానీ ( స్థానేశ్వరము )
20 ) బిల్వపుత్రిక ( బిల్వకము )
21 ) మాధవి ( శ్రీశైలము )
22 ) భద్ర ( భద్రేశ్వరము )
23 ) జయ ( వరాహ శైలము )
24 ) కమల ( తిరువారూర్ )
25 ) రుద్రాణి ( రుద్రకోటి )
26 ) కాళి ( కాళంజర పర్వతము )
27 ) కపిల ( మహాలింగము )
28 ) ముకుటేశ్వరి ( మర్కోటము )
29 ) మహాదేవి ( సాలగ్రామము )
30 ) జలప్రియ ( శిలింగము )
31 ) కుమారి ( హరిద్వారము )
32 ) లలిత ( సంతాన క్షేత్రము
33 ) ఉత్పలాక్షి ( సహస్రాక్షము )
34 ) మహాత్సల ( కమలాక్షము )
35 ) మంగళ ( గంగాతటము )
36 ) విమల ( పురుషోత్తమ క్షేత్రము )
37 ) ఆమోఘాక్షి ( విపాశాతీరము )
38 ) పాటల ( పుండవర్ధనము )
39 ) నారాయణి ( చిసుపార్శ్వము )
40 ) భద్రసుందరి ( వికూటము )
41 ) విపులేశ్వరి ( విపులము )
42 ) కళ్యాణీ ( మలయాచలము )
43 ) కోటని ( కోటి తీర్థము )
44 ) సుగంధ ( మాధవవనము )
45 ) త్రిసంధ్య ( హృషీకేశము )
46 ) రతిప్రియ ( గంగా ద్వారము )
47 ) సునంద ( శివకుండము )
48 ) నందిని ( దేవికాతటము )
49 ) రుక్మిణి ( ద్వారక )
50 ) రాధ ( బృందావనము )
51 ) దేవిక ( మధుర )
52 ) పరమేశ్వరి ( పాతాళ )
53 ) సీత ( చిత్రకూటము )
54 ) వింధ్య వాసిని ( వింధ్యాచలము )
55 ) ఏకవీర ( సహ్యపర్వతము )
56 ) చంద్రిక ( హరిశ్చంద్రము )
57 ) రమణ ( రామతీర్థము )
58 ) మృగావతీ ( యమునాతటకము )
59 ) మహాలక్ష్మి ( కొల్హాపూర్ )
60 ) ఉమాదేవి ( వినాయక క్షేత్రము )
61 ) ఆరోగ్య ( వైద్యనాధము )
62 ) మహేశ్వరి ( మహాకాళము )
63 ) అభయ ( ఉష్ణతీర్ధము )
64 ) అమృత ( వింధ్యకందరము )
65 ) మాండవి ( మాండవ్యము )
66 ) స్వాహ ( మహిష్మతి )
67 ) ప్రచండ ( ఛాగలాండము )
68 ) చండిక ( మకరందము )
69 ) వరారోహ ( సోమేశ్వరము )
70 ) పుష్కరావతి ( ప్రభాసము )
71 ) దేవమాత (సరస్వతీ సముద్రసంగమముు)
72 ) మహాభాగ ( మహాలయము )
73 ) పింగళేశ్వరి ( పయోస్తీ తీరము )
74 ) సింహిక ( కృతశౌచము )
75 ) యశస్కరి ( కార్తికేయ క్షేత్రము )
76 ) లోల ( ఉత్పలావర్తము )
77 ) సుభద్ర ( శోణగంగా సంగమము )
78 ) లక్ష్మీదేవి ( సిద్ధపురం )
79 ) అంగన ( భరతాశ్రమము )
80 ) విశ్వముఖి ( జాలాంధరము )
81 ) తార ( కిష్కింధా పర్వతము )
82 ) పుష్టి ( దేవదారువనము )
83 ) మేధ ( కాశ్మీరు మండలము )
84 ) భీమాదేవి ( హిమాద్రి )
85 ) పుష్టి ( విశ్వేశ్వరము )
86 ) శుది ( కపాలమోచనము )
87 ) మాత ( కాయవరోహణము )
88 ) ధ్వని ( శంఖోద్దారము )
89 ) థృతి ( పెండారకము )
90 ) కాల ( చంద్రభాగా తీరము )
91 ) శివకారిణి ( అచ్ఛోదము )
92 ) అమృత ( వేణాకటము )
93 ) ఊర్వశి ( బదరీవనము )
94 ) ఓషధి ( ఉత్తర కురుభూమి )
95 ) కుశోదక ( కుశద్వీపము )
96 ) మన్మధ ( హేమకూటము )
97 ) సత్యవాదిని ( ముకుటము )
98 ) వందనీయ ( అశ్వత్థము )
99 ) నిధి ( అలకాపురము )
100 ) గాయత్రి ( వేదములు )
101 ) పార్వతి ( శివసన్నిధి )
102 ) ఇంద్రాణి ( దేవలోకము )
103 ) సరస్వతి ( బ్రహ్మముఖము )
104 ) ప్రభ ( సూర్యమండలము )
105 ) వైష్ణవి ( మాతృకలు )
106 ) అరుంధతి ( పతివ్రతలు )
107 ) తిలోత్తమ ( రమణులు )
108 ) బ్రహ్మకళ ( శరీరులందలి చిత్తములు )