కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులకు నారదుడు  తీసుకుని వచ్చి యిచ్చిన ఆమ్రఫలము వలన అన్నదమ్ముల మధ్య విరోధం ఏర్పడింది. ఆ ఆమ్రఫలాన్ని పంచడంలో మాతాపితరులు గణేశుని పట్ల పక్షపాతబుధ్ధి చూపారని  కుమారస్వామి కోపంతో కైలాసం వదలి  పళని పర్వతానికి వెళ్ళడం అందరికీ తెలిసిన కధ. కుమారస్వామి సర్వం త్యజించి  సన్యాసిగా పళని కొండపై నివసించడం గణపతికి మనస్తాపం కలిగించింది. జరిగిపోయిన  సంఘటన తలుచుకుని మామిడిపండును తన సోదరునికే యిచ్చి వుండి వలసినదని వేదనపొందాడు. పార్వతీ పరమేశ్వరులు  ఎంత సమాధానపరచినా  గణపతి మనసుకి ప్రశాంతి కలుగలేదు.  భూలోకానికి వెళ్ళి తపమాచరించి ప్రశాంతత చేకూర్చుకోవాలని నిర్ణయించాడు. సరైన తపోభూమికై మార్గాన్ని సూచించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. అందుకు పరమశివుడు భూలోకంలో దక్షిణాన వున్న చంపకారణ్యంలో తపస్సు చేయమని
పుత్రుని ఆదేశించాడు.

ఆవిధంగా గణేశుడు తపస్సు చేసిన స్ధలమే  ఈనాటి తమిళనాడు నాగై జిల్లాలోని షణ్బగపురం.

ఆదికాలంలో  కుంభ రూపాన  ఇక్కడ వినాయకుడు స్వయంభూగా అవతరించినందున యీ వినాయకునికి ఆదికుంభేశ్వర వినాయకుడు అని పేరు వచ్చింది. ఆలయానికి దక్షిణమున పుష్కరిణి, ఉత్తరమున వీరన్ ఆలయ నది ప్రవహిస్తూ వున్నది.

వినాయకుడు తపస్సుకు దానవుల వలన భంగం ఏర్పడకుండా   పుత్రునికి రక్షణ ఏర్పాటు చేయమని పార్వతి కోరగా   పరమేశ్వరుడు పంచభూతాల రూపం దాల్చి షణ్బగపురానికి ఈశాన్యమున వున్న వండలూరు, తూర్పునగల మోగనూరు,  దక్షిణమున వున్న సింహమంగళం, పడమటగల కిళ్ళుక్కుడి,  ఉత్తరమున గల అణైక్కుడి అనే ఐదు గ్రామాలలో వెలసినట్లు స్థలపురాణం చెపుతోంది.

ఒకానొకకాలంలో  మహావైభవంగా విరాజిల్లిన ఈ  ఆలయ స్థలంలోనే  ఇప్పుడు వున్న ఆలయం క్రొత్తగా నిర్మించబడింది. గర్భగుడిలో ఆదికుభేశ్వర వినాయకుడు దర్శనం యిస్తున్నాడు. ఈ స్వామి  భక్తుల కోరికలను వెంటనే తీర్చే   స్వామి.

ఈ  ఆది కుంభేశ్వర వినాయకుని ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు, మాసోత్సవాలు, గణపతి నవరాత్రులు వంటి ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.