ॐశ్రీవేంకటేశాయ నమః
’కామం’ అనగానే చాలా మందికి పలు ‘వికృతభావనలు’ కలుగుతాయి. నిజానికి “కామం”అంటే “కోరిక” అని మాత్రమే అర్థం. “కావాలి” అని మనం అనుకునే ప్రతిదీ కోరికే.
అంటే మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదన ఇలా ప్రతిదీ కోరికే. మనం ఊహించుకునే ఇతరత్రా విపరీత భావనలన్నీ కూడా అందులో ఒక భాగం మాత్రమే. కోరికలుంటే ఏం ఔతుంది? ప్రతీ మనిషికి కోరికలు వుండడం సహజమే. దానికొక పరిమితి ఉండాలి. అంతే కాని అత్యాశ ఉండవద్దు. కామాన్ని జయిస్తేగానీ మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేము. ఆ విధంగా ఆలోచిస్తే దీనిని జయించడమే మేలు అని అనిపిస్తుంది.
అందులోనూ ఎక్కడ చూచిన ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించిన వాడు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతాడు అన్నది మనకు అన్ని వేద గ్రంధాలలో తెలియపరచినారు. అంతేకాక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో కూడ మొదట కామంనే తీసుకున్నారు.
ఎందుకంటే కామం వెనుక ఉన్నవి అన్నీ కూడా కామం నుండే మరియు కామం వలననే కలుగుతాయి కాబట్టి ఇక్కడ కూడ మొదట కామాన్నే ప్రస్తావించారు. ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు “విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపకశక్తి నశించి తత్ఫలితంగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును” అని చెప్పాడు.
’అర్జునా! పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది. కాబట్టి దీన్ని జయించడం ఉత్తమం’ అన్నాడు.
ఈ కామం మూలంగా మన మనస్సులో కూడ ఎప్పుడు సముద్రంలో అలల లాగ మన మనస్సులో కూడ అలలు వస్తూనే ఉంటాయి. అంటే మన మనస్సులో కలిగే ప్రతి అలజడికి కారణం ఈ కామమే మూల కారణం. అందువలన కామాన్ని (కోరికలను) అణచివేస్తే గాని మనం మన లక్ష్యానికి మనం చేరువ కాలేము.
మనం కామాన్ని ఎందుకు జయించాలో తెలుసుకున్నాము. కాని ఎలా జయించాలో చూద్దాం.
కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాల కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాలా సులువైన పని. దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకులపరచడమే.
దాన్ని సానుకూలపరచడం అంటే దానికి శాశ్వతత్వాన్ని తెలియపరచి, నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు. అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది.
అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్నాము. ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు దృష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి. ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది.
మనం భగవంతుని ముందర కోరికలను కోరడం (అంటే అవికావాలి,ఇవికావాలి అని) కోరుకోకూడదు. “జరిగిపోయినవి అన్నీ మన మంచికే, జరగబోతున్నవి కూడా మన మంచికే” అని ముందు మన మనస్సును స్థిరపర్చాలి.
రోజూచేసే పనిని అది ఏదైనా భగవంతార్పణ బుద్దితో, నిష్కల్మషంగా, ప్రతి ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరిస్తూ వుంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిదానంగా ఖచ్చితంగా పరిశుద్దమై అదే కోరికలను త్యజిస్తుంది.
ప్రతీరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి పది నిమిషాలపాటు అట్లే కూర్చొని సాధన(ధ్యానం) చేస్తే నీలోని కోరికలు వాటంతట అవే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడ చాల హాయిగా, ఆనందంగా వుంటుంది.
ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు కూడ మంచం ఎక్కగానే ఒక పది నిముషాలు కూర్చొని నీ హృదయంలో దివ్యజ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి సాధన (ధ్యానం) చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాల ప్రశాంతమైన, సుఖవంతమైన నిద్ర వస్తుంది.(దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు)
ఈ విధంగా మనం మన ఆలోచనా విధానాలను ఎంచుకొనే మార్గాలను ఒక శాశ్వతమైన విషయం మీదకు మరలిస్తూ వుంటే మిగిలినవన్నీ వాటికవే సర్దుకుంటాయి. అలా మనం సంపూర్ణంగా కామాన్ని జయించిన వాళ్లమౌతాం.
సేకరణ…