“కలౌ వేంకటనాయకః అని ప్రసిద్ధికెక్కిన ఏకైక నాయకుడైన కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఎప్పుడో ఏనాడో కలియుగాదిలో వేంకటాచల క్షేత్రంపై స్వయంభువుగా వెలసి, భక్తుల నాదుకొని రక్షించడంలో తనకు సాటి ఎవరూ లేరంటూ దశదిశలా చాటుకొంటూ, అత్యంత భక్తప్రియుడుగా పేరొందిన స్వామి శ్రీనివాసుడు. అందుకే “వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అన్న ప్రసిద్ది ఏర్పడింది.

భక్తులపాలిటి కొంగుబంగారమయిన ఈ స్వామిని కేవలం మానవులే కాదు. (బ్రహ్మాది దేవతలు సయితం కీర్తిస్తూ, బంగారు వాకిలివద్ద శ్రీ స్వామివారిదర్శనం కొరకు పడిగాపులు కాస్తారట!

కేవలం దర్శనంతోనే తృప్తిపడక సామాన్యభక్తులు
నుండి బ్రహ్మదేవుని వరకు, ఆ తిరుమల గోవిందునికి ఎన్నో ఉత్సవాలు చేయిస్తారు. ఊరేగింపులు నిర్వహిస్తారు. అందుకనే తిరుమలక్షేత్రం ఉత్సవాలతో, వేడుకలతో ఎప్పుడూ సందడిగానే వుంటుంది. అహరహం ఆనందనిలయుడు ఆనందంగా కొండలమధ్య కోలాహలంగా వుంటాడు.

నిజమే మరి! ఆ స్వామి నిత్యకల్యాణచక్రవర్తి. శ్రీదేవి భూదేవులు నిత్యనూతన వధువులు. అందుకే తిరుమల క్షేతం “నిత్య కల్యాణం పచ్చ తోరణం గా ప్రసిద్ధికెక్కింది. తిరుమలక్షేత్రంలో ప్రతి రోజూ పండగే! ప్రతిపూటా పాయసాలే, పరమాన్నాలే! పిండివంటలే! ఆహాహా! శ్రీనివాసుడిది ఎంతటి భోగం! ఎంతెంతటి వై భోగం!!

తిరుమల శ్రీనివాసుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడట! ఎంతటి నైవేద్యప్రియుడో అంతటి భక్త ప్రియుడట! అందుకే తాను ఆరగించినవన్నీ భక్తులు తింటేనే ఆయన కానందం! తాను తిన్నవన్నీ భక్తులు తింటేనే ఆయనకు ఒక తృప్తి. అసలు భక్తులకు తినిపించడానికే శ్రీవేంకటేశ్వరుడు మంచి మంచి కమ్మనైన పిండివంటల్ని అన్నప్రసాదాల్ని ఆరగిస్తాడట! ప్రపంచంలో ఈ స్వామిని మించిన నైవేద్యప్రియుడూ, భోజనప్రియుడు మరొకడు కన్పడడు.

తిరుమల స్వామి ఎన్నెన్ని ఆరగిస్తాడో వాటిని ఏకరువు పెట్టలేక తెనాలి రామకృష్ణుడు “తిండిమెండయ్యగారు” అంటూ ఒక్క మాటలో తిరుమలప్పనికి పెద్ద బిరుదునే తగిలించాడు.

ఇలా ఇన్ని విధాలుగా, ఇందరి చేత పొగడబడిన తిరుమలస్వామి నిత్యమూ “తోమని పళ్లాల్లో ఆరగిస్తాడు తెలుసా! తోమని పళ్లాల్లో ఆరగించే శ్రీ వేంకటేశ్వరుని భోగం ఎంతటిదోకదా అని మురిసిపోతూ ఆశ్చర్యపోతున్నారు కదూ! వినండి!

ఆ స్వామి ఒకసారి ఆరగించిన పళ్లాన్ని మళ్లీ తోమకుండా పారవేస్తారు.మళ్లీ భోజనానికి మళ్లీ కొత్త పళ్ళెం, వినియోగిస్తారు. ఆ “తోమని పళ్లాలు” ఏమిటో తెలుసా! మట్టి కుండలు. అది కూడా సగం పగిలిన మట్టికుండ! దాన్నే “ఓడు” అంటారు. భక్త ప్రియుడైన వేంకటేశ్వరుడు తాను పగిలిన మట్టి పెంకులో భోజనం చేస్తూ భక్తుల చేత విందారగింప చేస్తున్నాడు. భక్తులే తనకు పరమార్ధం! భక్తుల ఆనందమే తన కానందం! అంటూ మురిసిపోతూ చిరుమందస్మిత వదనంతో ప్రకాశిస్తున్న స్వామిని భక్తులు. పాడుకొంటూ వేడుకొంటారు.

ప్రస్తుతం తిరుమల స్వామివారికి సుప్రభాతం మొదలు ఏకాంతసేవ వరకు ఏ ఏ పదార్థాలు, పిండి వంటలు, అన్న ప్రసాదాలు నివేదనమవుతాయో క్లుప్తంగా పరిశీలిద్దాం.

ప్రతి రోజు తెల్లవారు జామున సుప్రభాతంలో శ్రీవారికి వెన్ను పాలు, చక్కెర నివేదిస్తారు. ద్వాపర యుగంలో ఉదయం లేచిన వెంటనే యశోదాదేవి వెన్నముద్దలు తినిపించేదట! ఆ నాటి అలవాటేమో మరి?

ఇక ఆ తర్వాత శ్రీ శ్రీనివాస స్వామి వారికి కొలువు (దర్బార్‌) జరుగుతుంది. బంగారు సింహాసనంపై ఛత్ర చామర మర్యాదలతో మహా దర్భం గా వేంచేసి ఉన్న శ్రీనివాసప్రభువుల వారికి రాజోచిత మర్యాదలన్నీ సమర్పించి, పంచాంగశ్రవణం వినిపించిన తర్వాత, వేయించిన నువ్వులను బెల్లంతో కలిపి దంచిన ఈ పిండిని ప్రతిరోజూ శ్రీనివాసుడు ఆరగించడం విశేషం.

పిదప “మొదటి గంట” అని పిలువబడే తాలి నైవేద్యంలో శ్రీవారికి ఎదురుగా పులిహార, పొంగలి, దధ్యోదనం, చక్కెర పొంగలి మున్నగు అన్న ప్రసాదాలు, లడ్డు, వడలు, అప్పాలు, వగైరా పిండివంటలు కులశేఖరపడికి ఇవతలే ఉంచుతారు. ఇంతలో ప్రధాన వంటదారుడు ‘ఓడు’ అని పిలువబడే పగిలిన మట్టి కుండలో “మాత్ర” అనబదే మాతృదధ్యోదనాన్ని మాత్రమే ఆనంద నిలయంలోనికి తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తాడు. ఈ ఓడు ప్రసాదం తప్ప మిగిలిన ప్రసాదాలన్నీ శ్రీ స్వామివారికి ఎదురుగా గడప కివతలే నివేదన చెయ్యబడతాయి.

ఇక మధ్యాహ్నం గంట నివేదనలో శుద్దాన్నంతోపాటు, పైన పేర్మాన్న అన్నప్రసాదాలు, లడ్లు వగైరాలతోపాటు, భక్తులు తాము సమర్పించదలచిన ప్రసాదాలు ఇప్పుడే నివేదింపబడతాయి. రెండవ గంట అయిన వెంటనే శ్రీ స్వామివారు ఉభయదేవేరులతో కల్యాణోత్సవానికి వచ్చేస్తారు. నిత్య కల్యాణోత్సవంలో లడ్డు, వడలు, దోసెలు, అప్పాలు, చక్కెర పొంగలి,పులిహోర, పొంగలి, దధ్యోదనం వగైరాలు నివేదింపబడతాయి.

ఆ తర్వాత శ్రీ స్వామివారు వసంతోత్సవంలో పాల్గొంటారు. పై మాదిరే దోసెలు, అన్నప్రసాదాలు నివేదింపబడతాయి. ఇక స్వామివారికి అద్దాల మహల్లో డోలోత్సవంలోనూ, ఆ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలోను “పంచకజ్ఞాయం” అనే ప్రసాదం నివేదింపబడుతుంది. చక్కెర, గసగసాలు, కలకండ ముక్కలు, ఎండుద్రాక్ష గోడంబి, బాదం పలుకులు అన్నీ కలిపి తయారు చేసిన పొడి ప్రసాదం ఈ పంచకజ్ఞాయం.

సేకరణ…