సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.

బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం. శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.
ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు. కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు.

అది వారి శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది. మొండిగా “మేం పాటిస్తున్నాం”  అని చాదస్తంతో శరీరాన్ని మాత్రం బాధపెట్టకూడదు. అలాగని శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో అసలు సాధన చేయకుండా ఊరికే ఉండకూడదు.

ఆహారనియంత్రణ అయినా చేయగలగాలి. రుచికోసం కాకుండా దేహధారణార్థం సాత్త్వికమైన ఫలహారమో,క్షీరమో తీసుకుని ఉపవాస దీక్ష చేయవచ్చు.

ఆహారనియంత్రణ, మెలకువ – ఈ రెండింటితోనే మహాశివరాత్రి ఆరాధన చేయాలి. అలా ఒక్క శివరాత్రి నియమబద్ధంగా చేసినప్పటికీ సంవత్సరకాల శివారాధన చేసిన ఫలితం లభిస్తున్నదని శాస్త్రంలో ఉన్న విషయం.

— బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ