దేవుని భావించుటలో వివిధములైన మార్గములు ఉన్నవి.

1.కొందరు మునులు భగవంతుని సత్త్వగుణ స్వరూపునిగ తెలిసికొనిరి, (మంట వెలువడువలెనన్నచో కట్టెను అంటించవలెను… అప్పుడు పొగ రాక తప్పదు, అట్లే భగవంతుని భావింపవలెనన్నచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు ఉండవలెను )…
త్రిగుణాత్మకమైన సృష్టిగా దిగివచ్చిన దేవుడు ‘హరి’ లేక ‘అధోక్షజుడు’ అనబడును…
(అధోక్షజుడు అను పదమునకు అధస్+ఉక్షజుడు, క్రిందికి దిగివచ్చిన వీర్యశక్తి గలవాడు అని అర్థము… ఈ వీర్యము వలననే సృష్టి జరుగు‌ను) సృష్టి జీవులచే భావింపబడు దేవుడు హరియే‌…

2. కొందరు సంసారమందలి మేలుగోరి ఇతరులను సేవింతురు.
(ఇతరుల రూపమున ఉన్న దేవుని గుర్తించుకొని సేవింతురు )

3. సూటిగా మోక్షము పొందదలచిన కొందరు ఇతరులను సేవింపరు, కారణము ఏమనగా జీవులలో పంచభూతములకు అధీనులై వాని ప్రభావమున బ్రతుకువారు, గోరములైన పనులు చేయుచు గోర రూపములై జీవించు వారు ఉన్నారు.

వారిని నింద చేయక శాంతులై నారాయణ కథల యందు మాత్రము మనస్సు నిలుపుచు వీరు మోక్షము కోరి సాధన చేయుదురు‌.

భగవంతుడు అనేక దేవతల రూపమున ఉన్నను, అందు అంతర్యామియైన నారాయణునే వీరు ఆశ్రయింతురు‌.
మిగిలిన వారిని నిందింపరు, నిందించుట వలన రజస్తమస్సులంటుకొని కామక్రోధములు కలుగునని వారికి తెలియును‌.